అనంతపురం జిల్లాలో భారీ 'హనీ ట్రాప్' ముఠా గుట్టురట్టయింది. మహిళలను ఎరగా వేసి, సంపన్నులను ట్రాప్ చేసి లక్షల రూపాయలు గుంజుతున్న ముఠా వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఈ వ్యవహారంలో సామాన్య నేరస్తులే కాకుండా, రక్షణగా ఉండాల్సిన పోలీసు అధికారులే నిందితులకు సహకరించడం సంచలనంగా మారింది.
స్కెచ్ ఇలా వేస్తారు
ఈ కేటుగాళ్లు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగుతారు. ముందుగా ఒక మహిళను పని ఉందంటూ బాధితుల వద్దకు పంపిస్తారు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేస్తారు. రేప్ కేసు పెడతాం అని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తారు. భయపడి డబ్బు ఇవ్వకపోతే, తమకు తెలిసిన పోలీసుల ద్వారా పంచాయితీలు పెట్టి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇలా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా రూ. 10 లక్షలు, ఓ జ్యోతిష్యుడిని బెదిరించి రూ. 5 లక్షలు వసూలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బయటపడింది.
పోలీస్ అధికారులపై వేటు
ఈ ముఠాకు ఇద్దరు సీఐలు రాజేంద్రనాథ్, శ్రీహర్ష సహకరించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వీరిద్దరినీ కర్నూలు వీఆర్ (V.R)కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ ముఠాలోని ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేయగా, దీనితో సంబంధం ఉన్న మరో కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం ఎస్పీ జగదీష్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శాఖలోని అవినీతిపరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

