గుడి గోపురంపై గాంధీ తాత

గుడి గోపురంపై గాంధీ తాత

మామూలుగా అయితే గుడి గోపురాలపై దేవుళ్ల బొమ్మలుంటాయి. పురాణాలు చెప్పే చరిత్ర ఉంటంది. కానీ, శ్రీలంకలోని జాఫ్నాలో ఉన్న వల్లిపురం విష్ణు ఆలయంపై మాత్రం దేవుళ్ల బొమ్మలతో పాటు గాంధీజీ విగ్రహం ఉంటుంది. చుట్టూ ఇసుక దిబ్బల మధ్య ఈ గుడి ఉంటుంది. బంగాళాఖాతాన్ని శ్రీలంకతో అనుసంధానిం చే పాక్ జలసంధికి అతి దగ్గరలోనే ఈ గుడి ఉంది. ఇటు కన్యాకుమారికీ అది చేరువలోనే ఉండడం విశేషం. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం లో అశోక చక్రవర్తి కుమారుడు,కుమార్తె అయిన మహింద్ర, సంఘమిత్రలు జాఫ్నాదీవులకు వెళ్లారట. వాళ్లిద్దరూ జాఫ్నా రాజు దేవానాంపియ తిస్సాను బౌద్ధ మతంలోకి మార్చారట. బీహార్ లోని బోధ్ గయ నుంచి తీసుకెళ్లిన బోధి చెట్టు కొమ్మను అక్కడ నాటారట. అక్కడే వాళ్లిద్దరూ చనిపోయారట. వాళ్లకు గుర్తుగా వల్లిపురంలో విష్ణు గుడి కట్టాడట దేవానాం పియ. అంతేకాదు, ఆఆలయంలోనే వారి నిలువెత్తు విగ్రహాలనూ స్థాపించాడట. స్తూపాలు, శిలాశాసనాలూ వేయించాడట. అయితే, విష్ణు గుడి కట్టిన ప్రాంతంలో బౌద్ధుల కన్నా ముందే వేరే జనాలు నివసించారని కొందరు చరిత్ర కారులు చెబుతున్నారు. అక్కడే కొత్త రాతి యుగం నాటి శ్మశాన వాటికలూ ఉన్నాయట. అయితే, ఆ గుడిపైనే గాంధీ విగ్రహం ఉండడమే వల్లిపురానికి ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. 1927 నవంబరులో కొన్ని వారాల పాటు గాంధీ శ్రీలంకలో గడిపారట.ఆ టైంలో జాఫ్నాలోని పలు సభల్లో మాట్లాడారట. అంటరానితనాన్ని విడనాడాలని అగ్రకులాల వారిని కోరారట. గుళ్లోకి అందరినీ అనుమతించి సోదరభావాన్ని చాటాలని చెప్పారట. దేవదాసీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పారట. దీంతో అక్కడి పేద వర్గాలు గాంధీని ఓ దేవుడిగా చూశారట. ఆ క్రమంలోనే గుడి గోపురంపై గాంధీ విగ్రహాన్ని పెట్టారని చెబుతారు. నిజానికి ఆయన వచ్చి పోయిన వెంటనే గోపురంపై ఆయన కొలువు దీరలేదు. 1983లో గుడి గోపురాన్ని ప్రారంభిం చారట. 1990 నాటికి అది పూర్తయ్యింది. అప్పుడే గాంధీ తాత విగ్రహాన్ని దేవుడికి సూచికగా ఇలా నిలబెట్టారని చెబుతున్నారు. లిబరేషన్ టైగర్స్​ ఆఫ్ తమిళ్ ఈలం చేపట్టిన పౌర యుద్ధం తో ఆ దేశం అతలాకుతలమైన రోజులవి.