శశిథరూర్ పై భారీ ఆధిక్యంతో గెలుపొందిన ఖర్గే

 శశిథరూర్ పై భారీ ఆధిక్యంతో గెలుపొందిన ఖర్గే

ఏఐసీసీ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. శశిథరూర్ పై 7,897 ఓట్ల భారీ ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. శశి థరూర్ కు 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితాలను కాంగ్రెస్​ సెంట్రల్​ ఎలక్షన్​ అథారిటీ ఛైర్మన్​ మధుసూధన్​ మిస్త్రీ ప్రకటించారు. 416 ఓట్లు చెల్లలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖర్గే రికార్డు  సృష్టించారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరిగింది. దేశ వ్యాప్తంగా ఈనెల 17న అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ జరిగింది. మొత్తం 9వేల మంది డెలిగేట్స్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా ఫలితంతో సోనియా గాంధీ స్థానంలో ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.

137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ...

137 ఏండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఆరోసారి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తొలిసారిగా 1950లో జరిగిన ఎన్నికల్లో పురుషోత్తమ్ దాస్ గెలిచారు. 1947 జరిగిన ఎన్నికల్లో సీతారామ్ కేసరి విజయం సాధించారు. 2000 సవంత్సరంలో జరిగిన ఎన్నికల్లో జితేంద్ర ప్రసాద్ పై సోనియా గాంధీ గెలిచారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లల్లో 40 ఏండ్ల పాటు కాంగ్రెస్ పగ్గాలు గాంధీ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. తొలిసారి 1998లో అధ్యక్షురాలైన సోనియా..19ఏండ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. 2017లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్ 2019 వరకు కొనసాగారు. ఆ ఏడాది సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో మళ్లీ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. 

గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు..


కర్ణాటక కాంగ్రెస్లో మల్లికార్జున్ ఖర్గే కీలక నేత. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడుగా ఖర్గేకు మంచి పేరుంది. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని వరవట్టి గ్రామంలో 1942 జూలై 21న నిరుపేద కుటంబంలో జన్మించారు. బీఏ చేసి, న్యాయశాస్త్రం చదివిన ఖర్గే కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశారు. దళిత వర్గానికి చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. రాజ్యాంగంపై ఖర్గేకు మంచి పట్టుంది. 1969లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన తొలిసారిగా 1972లో గుర్మిత్‌కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుంచి వరుసగా 9 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1976లో దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. ఆ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఆయన్ని మంత్రిగా నియమించేవారు.1996 నుంచి 1999 వరకు, 2008 నుంచి 2009 మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 

2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో...

2005 నుంచి 2008 మధ్యకాలంలో కర్ణాటక పీసీసీ చీఫ్ గా కూడా ఖర్గే బాధ్యతలు చేపట్టారు. మూడు పర్యాయాలు( 1999, 2004, 2013 ) సీఎం అవకాశాలను కోల్పోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. అలా అని పార్టీపై తిరుగుబావుటా ఎగరేయలేదు. 2009లో తొలిసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఖర్గే... మ‌న్మోహ‌న్ సింగ్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత రైల్వే మంత్రిత్వ శాఖతోపాటు న్యాయశాఖ బాధ్యతలను చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో కలబురిగి లోక్‌సభ నియోజక వర్గం నుంచి లోక్ సభకు ఎన్నికైన ఖర్గేను అధిష్టానం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా  నియమించింది. 

రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఖర్గే...


హిందీలో అనర్గళంగా మాట్లాడే ఆయన బీజేపీ ఎంపీలకు తన వాక్చాతుర్యంతో చురకలంటించేవారు. ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఖర్గే 2019 సార్వత్రిక ఎన్నికల్లో  తొలిసారిగా ఓడిపోయారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2021 ఫిబ్రవరిలో రాజ్యసభకు పంపించింది. అప్పటి నుంచి రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఖర్గే వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గేను గాంధీ కుటుంబమే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దించినట్లుగా వార్తలు వచ్చాయి.