- భార్య ఫొటో మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్‌కు పంపిన్రు
- డబ్బులు కట్టినా వదిలిపెట్టలేదు
- ఏమీ చేయలేక ఉరేసుకున్న వినోద్
జీడిమెట్ల, వెలుగు:పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోన్‌యాప్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ లం నందిగామకు చెందిన మరిగిద్దె వినోద్‌కుమార్(35) కొన్నేండ్ల కింద సిటీకి వచ్చి బోయిన్‌పల్లిలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.
భార్య మంజూషదేవి, బాబు అఖిరానందన్ (4), పాప నందన(3)తో కలిసి చింతల్ శ్రీరామనగర్ లో ఉంటున్నాడు. ఇటీవల వినోద్ తండ్రి శంకర్రావు అనారోగ్యంతో ఉండడంతో దవాఖాన ఖర్చుల కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేశారు. దీనికి తోడు వినోద్ కు మూడు నెలల నుంచి జీతం సక్రమంగా రావడం లేదు. కొద్ది నెలల కింద భార్యకు తెలియకుండానే ఆమె ఫోన్ నుంచి ఓ లోన్యాప్లో రుణం తీసుకున్నాడు.
ఆ టైంలో భార్య ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేసి తర్వాత యాప్ డిలీట్ చేశాడు. నెల నెలా వాయిదాలు కడుతూ వస్తున్నాడు. ఇటీవల కొన్ని వాయిదాలు చెల్లించలేదు. ఈ నెల 8న అతడి పెండ్లి రోజు కావడం, వినాయక చవితి ఉండడంతో యూసుఫ్‌గూడలోని సోదరుడి ఇంటికి భార్య, ఇద్దరు పిల్లలను పంపించాడు.
Also Read : బోర్లను మింగిన వాగులు
లోన్‌యాప్ నుంచి కాల్స్ రాగా ఆన్సర్ చేయలేదు. దీంతో లోన్‌యాప్ నిర్వాహకులు కుటుంబసభ్యులకు కాల్చేసి రూ.2300 కట్టాలని చెప్పారు. అంతటితో ఆగకుండా అతడి భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి అతడి ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు పంపారు. దీంతో అతడి బావమరిది లోన్‌యాప్ అమౌంట్చెల్లించాడు.
అయినా, మొత్తం డబ్బులను కట్టాలని మరోసారి కాల్స్‌చేసి వేధిస్తుండడంతో కలత చెందాడు. సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.