చిన్న వానొచ్చినా మ్యాన్ హోల్స్, డ్రైనేజీలు పొంగుతున్నయ్​!

చిన్న వానొచ్చినా మ్యాన్ హోల్స్, డ్రైనేజీలు పొంగుతున్నయ్​!

“ అబిడ్స్ లోని జీపీవో వద్ద ట్రూప్ బజార్ లో నాలుగు రోజులుగా మ్యాన్ హోల్ పొంగి పొర్లుతోంది. మానవ వ్యర్థాలతో కలిసి మురుగు బయటకు వస్తోంది. తీవ్ర దుర్గంధం వస్తుండగా స్థానికులు అధికారులకు కంప్లయింట్​చేసినా పట్టించుకోవడం లేదు.’’

“ రాంనగర్ పరిధి ఆదర్శ్ నగర్ కాలనీలో మూడు రోజులుగా సీవరేజీ ఓవర్ ఫ్లో అవుతోంది. రాంనగర్ గుండు కు వెళ్లేందుకు అది మెయిన్​రోడ్డు కావడంతో స్థానికులకు ఇబ్బందులు వస్తున్నా యి. దోమలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న కాలనీవాసులు.’’ 

హైదరాబాద్, వెలుగు :  సిటీలో చిన్న వాన పడినా మ్యాన్ హోల్స్ , డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. మురుగునీరు రోడ్లపైకి చేరి నిలిచిపోతుండగా వాహనాదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని వాటర్ బోర్డు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉండగా అధికారులు ఫెయిల్​అయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు మూడు చిన్నవానలు పడగా చాలా బస్తీలు, కాలనీల్లోని మ్యాన్​ హోల్స్ ​పొంగి పొర్లి మురుగుంతా రోడ్లపైనే నిలిచిపోయింది. ముఖ్యంగా రద్దీగా రూట్లలో డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. మరోవైపు ఇండ్లలోని వ్యర్థాలన్నీ రోడ్లపైకి చేరి తీవ్ర దుర్గంధం కలిగిస్తున్న సమస్య లోతట్టు కాలనీలు, బస్తీల్లో అధికంగా ఉంది.  ప్రతి డివిజన్ లోనూ స్థానికుల నుంచి కంప్లయింట్లు కూడా పెరిగాయి.  సీవరేజీ స్టాఫ్  తక్కువగా ఉండడంతోనే  యాక్షన్ ప్లాన్​ నత్తనడకన కొనసాగుతోందని వాటర్​బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. 

పదిరోజులుగా పెరిగిన ఫిర్యాదులు 

వానాకాలానికి ముందు నుంచే మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ ను వాటర్ బోర్డు అమలు చేస్తోంది. ఇప్పటికే మ్యాన్ హోల్స్​మరమ్మతులు, డ్రైనేజీ పైపు లైన్లు,  సీవరేజీ లైన్ల అభివృద్ధి వంటి పనులను కొనసాగిస్తోంది. ఏటా అమలు చేస్తున్నా నిర్వహణ మాత్రం గాడిలో పడట్లేదు. ఇండ్ల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలు, సీవరేజీ పైపు లైన్ల డ్యామేజీతో మ్యాన్ హోల్స్​ నిండిపోతున్నాయి. దీంతో చిన్నపాటి వానలకే ఓవర్ ఫ్లో అవుతున్నాయి. 10 రోజులుగా వాటర్ బోర్డు పరిధిలోని అన్ని డివిజన్లలో స్థానికుల నుంచి కంప్లయింట్లు ఎక్కువయ్యాయి. కాలనీలు, నాలా పరిధిలోని ప్రాంతాల నుంచే ఎక్కువగా వస్తున్నాయి.  ఇప్పటివరకు 3 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లుగా వాటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. 

గల్లీల్లో ట్రాఫిక్​ జామ్​లు

 రోజులు గడుస్తున్నా మురుగు క్లియర్ చేయడం లో వాటర్ బోర్డు సిబ్బంది ఆలస్యం చేస్తున్నారు. దీంతో కాలనీలు, బస్తీల్లోని రోడ్లపై మురుగు పారుతోంది.  మరో రూట్​లో వెళ్తున్న సందర్భాల్లో గల్లీల్లో ట్రాఫిక్ జామ్​లు అవుతున్నాయి. మెయిన్​రోడ్లపై నుంచి వెళ్తున్నా ఇబ్బందిగానే ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. 

శివారులో అధ్వానంగా.. 

శివారులోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో  కూడా సీవరేజీ నిర్వహణ వాటర్ బోర్డు పరిధిలోనే ఉంది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 32కు పైగా మున్సి పాలిటీలు ఉండగా, డ్రైనేజీ ఓవర్ ఫ్లో సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. స్థానికుల నుంచి కంప్లయింట్లు వస్తున్నా అధికారులు త్వర గా స్పందించడం లేదు. మున్సిపల్ సిబ్బం ది చెత్తా చెదారం, వ్యర్థాలను సకాలంలో తీయకపోవడంతో దుర్గంధంతో పాటు దోమలతో ఇబ్బంది పడుతున్నామని దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన రాజేంద్ర పేర్కొన్నారు.