V6 News

మేరీకోమ్‌ Vs నిఖత్‌… నేడే ట్రయల్స్‌‌ ఫైనల్‌‌ బౌట్‌‌

మేరీకోమ్‌ Vs నిఖత్‌… నేడే ట్రయల్స్‌‌ ఫైనల్‌‌ బౌట్‌‌
  • ఇద్దరి మధ్య ట్రయల్స్‌ ఫైనల్‌‌ నేడే
  • ఫస్ట్‌ రౌండ్‌ బౌట్లలో గెలిచిన మేరీ, నిఖత్

న్యూఢిల్లీ:  ఇండియా బాక్సింగ్‌‌ వర్గాలు, ఫ్యాన్స్‌‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. ఒలింపిక్స్‌‌ క్వాలిఫయర్స్‌‌ కోసం లెజెండరీ బాక్సర్‌‌ మేరీకోమ్‌‌, జూనియర్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌ నిఖత్‌‌ జరీన్‌‌ మధ్య ట్రయల్స్‌‌ ఫైనల్‌‌ బౌట్‌‌కు రంగం సిద్ధమైంది. ట్రయల్స్‌‌ ఫస్ట్‌‌ రౌండ్లలో విజయాలు సాధించిన ఈ ఇద్దరూ క్వాలిఫయర్స్‌‌ బెర్తు కోసం శనివారం అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన 51కేజీల ఫస్ట్‌‌ రౌండ్‌‌లో నిఖత్‌‌ 10–0తో నేషనల్‌‌ చాంపియన్‌‌ జ్యోతి గులియాను ఓడించింది. మరో బౌట్‌‌లో మేరీకోమ్‌‌ కూడా 10–0తో రితు గ్రేవాల్‌‌పై వన్‌‌సైడ్‌‌ విక్టరీ సాధించింది. దాంతో ఆరుసార్లు వరల్డ్‌‌ చాంప్‌‌ మేరీ, తెలంగాణ స్టార్‌‌ నిఖత్‌‌ మధ్య అంతిమ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సెలెక్షన్‌‌ పాలసీ రూల్స్‌‌ను పక్కనబెట్టి 51కేజీ కేటగిరీలో మేరీని నేరుగా సెలెక్ట్‌‌ చేస్తామని ఇండియా బాక్సింగ్‌‌ ఫెడరేషన్‌‌ (బీఎఫ్‌‌ఐ) ప్రకటించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సెంట్రల్‌‌ స్పోర్ట్స్‌‌ మినిస్టర్‌‌కు లేఖ రాసిన నిఖత్‌‌.. మణిపూర్‌‌ బాక్సర్‌‌తో తనకు సెలెక్షన్‌‌ ట్రయల్స్‌‌ నిర్వహించాలని డిమాండ్‌‌ చేసింది. దిగొచ్చిన బీఎఫ్‌‌ఐ ట్రయల్స్‌‌కు ఒప్పుకుంది. కాగా, ఫస్ట్‌‌ రౌండ్‌‌లో మేరీ ఏకపక్ష విజయం సాధించినప్పటికీ  మహిళల బాక్సింగ్‌‌ పెర్ఫామెన్స్‌‌ డైరెక్టర్‌‌ రఫేల్‌‌ బెర్గామస్కో సంతృప్తిగా లేడు. ‘బౌట్‌‌లో గెలిచినప్పటికీ తన బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌కు మేరీ దగ్గర్లో కూడా లేదు. ఆమె బౌట్‌‌ నాకు నచ్చలేదు. మేరీ చాలా ఇంప్రూవ్‌‌ కావాలి’ అని చెప్పాడు. కాగా, ఫైనల్‌‌ బౌట్‌‌లో మేరీతో తలపడే క్షణం కోసం తాను ఎదరూచూస్తున్నానని నిఖత్‌‌ తెలిపింది. ‘ఈ బౌట్‌‌ కోసం ఆత్రుతగా ఉన్నా. దీనికోసం నేను బాగా ప్రిపేర్‌‌ అయ్యా. ఇందులో నా బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌ ఇస్తా.  వంద శాతం పోరాడతా. ఈ ఫైట్‌‌ చిరకాలం గుర్తుండేలా మార్చుకోవాలని భావిస్తున్నా. ప్రస్తుతానికి నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఎందుకంటే ఫైట్‌‌ కావాలని నేను చాలా రోజుల నుంచి ఆశిస్తున్నా. అలాగే, బౌట్‌‌ చాలా క్లీన్‌‌గా జరిగేలా చూసుకుంటా’ అని చెప్పుకొచ్చింది.

కాగా, ఇతర ట్రయల్‌‌ బౌట్లలో 57కేజీ విభాగంలో సాక్షి చౌదరి 7–3తో  ఏషియన్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్‌‌ మనీషా మౌన్‌‌ను ఓడించింది. 60కేజీల తొలి రౌండ్‌‌లో సిమ్రన్‌‌జిత్‌‌ కౌర్‌‌ 5–0తో పవిత్రను చిత్తు చేసి మాజీ వరల్డ్‌‌ చాంపియన్‌‌ సరితా దేవితో ఫైనల్‌‌ ఫైట్‌‌కు రెడీ అయింది.  మరో బౌట్‌‌లో  సరితా 9–1తో మీనా రాణిని ఓడించింది. 75కేజీల బౌట్‌‌లో నుపూర్‌‌ 9–1తో సవీతపై గెలిచింది.  పూజా రాణితో  ఆమె ఫైనల్లో తలపడనుంది.  ట్రయల్స్‌‌లో గెలిచిన బాక్సర్లు ఫిబ్రవరి 3 నుంచి 14 వరకు జరిగే ఒలింపిక్‌‌ క్వాలిఫయర్స్‌‌లో ఇండియా తరఫున బరిలోకి దిగుతారు.

Mary Kom vs Nikhat Zareen in final of trials for Olympic Qualifiers