V6 News

నన్ను తక్కువ అంచనా వేయొద్దు..ఇపుడు నా మైండ్ సెట్ మారింది : శ్రేయాస్ అయ్యార్

నన్ను తక్కువ అంచనా వేయొద్దు..ఇపుడు నా మైండ్ సెట్ మారింది : శ్రేయాస్ అయ్యార్

శ్రేయస్ అయ్యర్..ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గానే కాదు..ఒక తిరుగులేని కెప్టెన్ గా తనను తాను నిరూపించుకున్నాడు. 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టులోకి అడుగుపెట్టిన అయ్యర్.. ఆ జట్టు రూపురేఖలనే మార్చేశాడు. ఒకప్పుడు పాయింట్ల టేబుల్స్ లో  వెనుకబడిన పంజాబ్‌ను  తన పదునైన వ్యూహాలతో ఫైనల్ వరకు తీసుకెళ్లి ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దాడు.

2025 ఫైనల్‌లో తృటిలో టైటిల్ చేజారినా.. అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ పట్టుదల మాత్రం తగ్గలేదు. దానికి నిదర్శనమే ఐపీఎల్ 2026 సీజన్.  ఆడిన  7 మ్యాచ్‌ల్లో 6 గెలిచి(ఒకటి రద్దు)  పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే  ఈ 31 ఏళ్ల స్టార్ ఆటగాడు ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు ఉన్నాయి.

ఇటీవలే జియోస్టార్ ‘బిలీవ్’ కార్యక్రమంలో అయ్యర్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. తన విమర్శకుల గురించి మాట్లాడుతూ.. నువ్వు ఇది చేయలేవు.. ఇది నీ వల్ల కాదు  అని ఎవరైనా అంటే నేను అస్సలు భరించలేను. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా అలాంటి మాటలు విన్నప్పుడు  వారు చెప్పింది తప్పని నిరూపించాలనే కసి నాలో పెరుగుతుంది. మరింత బలంగా ఎలా తిరిగి రావాలి? అన్నదే నా ముందున్న ఏకైక లక్ష్యం అని శ్రేయాస్ చెప్పుకొచ్చాడు.

 కెరీర్ ఆరంభంలో షార్ట్ పిచ్ బంతులను ఆడలేడని..విమర్శకులు అయ్యర్ బలహీనతను ఎత్తిచూపిన ప్రతిసారీ అయ్యర్ కుంగిపోలేదు. నా షార్ట్-బాల్ సమస్యను ఎప్పటికీ సరిదిద్దుకోలేనని చాలామంది అన్నారు. అదే నన్ను మరింత రెచ్చగొట్టింది. గతంలో అలాంటి బంతులను డిఫెన్స్ చేసేవాడిని, కానీ ఇప్పుడు నా మైండ్‌సెట్ మారింది. బంతి నా జోన్‌లోకి వస్తే చాలు  అది సిక్సర్‌గా మారాల్సిందే అని అన్నాడు.