మాయావతికి షాక్: ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్

మాయావతికి షాక్: ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్

జైపూర్: బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతికి భారీ షాక్ తగిలింది. తన పార్టీ తరఫున రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ఆమెకు హ్యాండిచ్చారు. మొత్తంగా ఆరుగురు శాసనసభ సభ్యులూ కలిసి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు ఇది మంచి బూస్టింగ్. నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లకు గాను కాంగ్రెస్ 100 చోట్ల గెలిచింది. బీజేపీ 72, బీఎస్పీ 6, మిగిలిన సీట్లను ఇతరులు, ఇండిపెండెంట్లు సొంతం చేసుకున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడుపుతోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బీజేపీ ఎక్కడ తమ రాష్ట్రంపై దృష్టి పెడుతుందోనని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ ఆందోళన చెందారు. తన రాజకీయ వ్యూహాలతో బీఎస్పీ ఎమ్మెల్యేలను ఆకర్షించి, కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. కమ్యూనల్ కుట్రలను నిలువరించి, రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగించాలన్న ఉద్దేశంతోనే తాము పార్టీ మారినట్లు వారు చెప్పారు. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ కు దొరికిన గొప్ప ముఖ్యమంత్రి అని, ఆయనకు మించిన వారెవరూ లేరని, ఆయన పాలసీలు నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.