మరో రెండు ప్రాజెక్టుల పనుల ‘మేఘా’కే

మరో రెండు ప్రాజెక్టుల పనుల ‘మేఘా’కే
  • టెండర్​ ధర కన్నా 4.5 శాతం ఎక్కువకు కోట్​ చేసిన సంస్థ
  • సంగమేశ్వరపై 4.65%, బసవేశ్వరపై 4.6% ఎక్కువకు బిడ్‌​
  • దాని వల్ల ప్రభుత్వంపై రూ.170 కోట్ల ‘అదనపు’ భారం
  • సింగూరు ప్రాజెక్టు మీద రెండు ఎత్తిపోతలు

హైదరాబాద్​, వెలుగు: సింగూరు ప్రాజెక్టు మీద చేపట్టనున్న ‘సంగమేశ్వర’, ‘బసవేశ్వర’ ఎత్తిపోతల పథకాల కాంట్రాక్టు పనులు మేఘా ఇంజనీరింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ (ఎంఈఐఎల్​)కే దక్కాయి. ఉమ్మడి మెదక్​ జిల్లాలోని 3.84 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ఈ రెండు లిఫ్ట్​ స్కీంలు చేపడుతున్నారు. గత నెలలో ఈ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచారు. సంగమేశ్వర ప్రైస్​ బిడ్​ను శుక్రవారం, బసవేశ్వర ప్రైస్​బిడ్​ను శనివారం జలసౌధలో ఓపెన్​ చేశారు. టెండర్​ ప్రైస్​తో పోలిస్తే నాలుగున్నర శాతం కన్నా ఎక్కువకు కోట్​ చేసిన మేఘా సంస్థే ఈ ప్రాజెక్టుల పనులను సొంతం చేసుకుంది. సంగమేశ్వర ఎత్తిపోతలకు రూ.2,249 కోట్లతో టెండర్లు పిలువగా మేఘా 4.65 శాతం ఎక్కువ కోట్​ చేసింది. నవయుగ 4.90 శాతం ఎక్సెస్​కు బిడ్​ వేసింది. బసవేశ్వర లిఫ్ట్​ స్కీంకు రూ.1,422 కోట్లతో టెండర్లు పిలువగా మేఘా 4.60 శాతం ఎక్సెస్​కు, ఎన్​సీసీ 4.80 శాతం ఎక్కువకు కోట్‌ చేశాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ఎల్​1గా నిలిచిన మేఘాకే కాంట్రాక్టులు ఇచ్చారు. నారాయణఖేడ్​, ఆందోల్​ నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా బసవేశ్వర ఎత్తిపోతలను కట్టనున్నారు. జహీరాబాద్​, సంగారెడ్డి, ఆందోల్​ నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అంచనాలతో సంగమేశ్వర లిఫ్ట్​ను నిర్మించనున్నారు.  

రూటు మార్చిన్రు​
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు స్కీముల్లో నాలుగున్నర శాతానికి పైగా ఎక్కువకు టెండర్లు ఖరారు చేయడంతో ప్రభుత్వంపై అదనంగా రూ.170 కోట్ల భారం పడనుంది. సంగమేశ్వర లిఫ్ట్​కు రూ.104 కోట్లు, బసవేశ్వరకు రూ.64 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్​ ఉప ఎన్నికలప్పుడు ప్రారంభించిన నెల్లికల్​ సహా అనేక ఎత్తిపోతల పథకాల టెండర్లూ నాలుగు శాతానికిపైగా అధిక ధరకే కట్టబెట్టారు. గతంలో ఒకటి, రెండు శాతం ఎక్సెస్​కు మాత్రమే కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు.. సెక్రటేరియట్​ టెండర్లతో రూటు మార్చాయి. అప్పటి నుంచి ప్రాజెక్టులు, ఇతర కీలక నిర్మాణ పనులన్నింటికీ నాలుగున్నర శాతంపైగానే సంస్థలు టెండర్​ కోట్​ చేస్తున్నాయి. దాని వెనుక ప్రభుత్వ పెద్దలున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.