నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల అమ్మకాలు

నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల అమ్మకాలు
  • ముగ్గురిని అరెస్ట్‌‌ చేసిన పోలీసులు
  • అమీన్‌‌పూర్‌‌, రామేశ్వరం బండ ప్రాంతాల్లో రూ.15 కోట్ల విలువైన స్థలాల అమ్మకం

సంగారెడ్డి, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి ప్లాట్లను అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరా లను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్‌‌ బుధవారం జిల్లా పోలీస్‌‌ ఆఫీస్‌‌లో వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం... అమీన్‌‌పూర్‌‌కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్‌‌ ముఠా ఏర్పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఖాళీ స్థలాలను గుర్తించి, వాటి యజమానుల పేరు మీద నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్మేందుకు ప్లాన్‌‌ చేశారు. ఇందులో భాగంగా స్థలానికి సంబంధించిన యజమాని పేరు మీద నకిలీ ఆధార్‌‌, సేల్‌‌ డీడ్‌‌, లింక్‌‌ డాక్యుమెంట్లను తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. మరో వైపు స్థలానికి సంబంధించిన యజమాని చనిపోయాడంటూ అతడి పేరున డెత్‌‌ సర్టిఫికెట్‌‌ తయారు చేయడంతో పాటు, అతడి కూతురు అంటూ మహిళ పేరున ఫ్యామిలీ సర్టిఫికెట్‌‌ సృష్టించేవారు.

వారికి రెండు, మూడు వేలు ఇస్తామంటూ చెప్పి రిజిస్ట్రేషన్‌‌ ఆఫీస్‌‌కు తీసుకెళ్లి సంతకం చేయించి ప్లాట్‌‌ను అమ్మేసేవారు. ఇలా గత 20 ఏండ్లలో సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌‌పూర్‌‌, రామేశ్వరం బండ ప్రాంతాల్లోని 15 నుంచి 20 ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్మేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో  గత నెల 20న దుర్గాప్రసాద్‌‌, సుబ్బారావు, రవిగౌడ్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేశారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత కేసు నమోదు చేసి అరెస్ట్‌‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరు అమ్మిన ప్లాట్ల విలువ సుమారు రూ.15 కోట్ల వరకు ఉంటుందన్నారు.

ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్‌‌ ఆపీస్‌‌ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందని, బాధ్యులను గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ప్లాట్లు కొనుగోలు చేసే టైంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో సీసీఎస్ ఇన్స్‌‌పెక్టర్‌‌ కిశోర్‌‌, డీసీఆర్‌‌బీ ఇన్స్‌‌పెక్టర్‌‌ రమేశ్‌‌ పాల్గొన్నారు.