భర్త టీవీ సౌండ్ తగ్గించమంటే.. కత్తితో పొడిచి చంపేశావ్..? ఏంటమ్మా ఈ ఘోరం ?

భర్త టీవీ సౌండ్ తగ్గించమంటే.. కత్తితో పొడిచి చంపేశావ్..? ఏంటమ్మా ఈ ఘోరం ?

మంగళగిరి: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు జరిగిన గొడవ కారణంగా కట్టుకున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ అనే 26 ఏళ్ల యువకుడు వృత్తి రీత్యా ఏసీ మెకానిక్. అదే ప్రాంతానికి చెందిన క్రాంతి అనే వివాహిత భర్త జైలుకి వెళ్లడంతో ఒంటరిగా ఉంటోంది.

ఆమెతో అహ్మద్కు సంవత్సరంనర క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేత సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లు సహజీవనం కొనసాగించిన ఈ ఇద్దరూ కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. సహ జీవనంలో ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత పెళ్లి చేసుకుని సంసార బంధంలోకి అడుగుపెట్టాక దూరమైంది. పెళ్లయిన కొన్నాళ్లు సాఫీగా సాగిన ఈ ఇద్దరి కాపురంలో కలతలు రేగాయి. అహ్మద్, క్రాంతికి అస్సలు పడేది కాదు. ఈ క్రమంలోనే.. గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కావడంతో అహ్మద్ ఉపవాసం పాటిస్తూ నమాజ్ చేసుకుంటూ ఉన్నాడు.

ఏసీ రిపేర్ వర్క్ ముగించుకుని గురువారం మధ్యాహ్నం అహ్మద్ ఇంటికి అలసిపోయి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో టీవీ పెద్ద సౌండ్తో వినిపించింది. క్రాంతి నట్టింట్లోనే కూర్చుని ఎక్కువ సౌండ్ పెట్టుకుని టీవీ చూస్తుండగా అహ్మద్ సౌండ్ తగ్గించమని.. తనకు ఇబ్బందిగా ఉందని చెప్పాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య లొల్లి మొదలైంది. 

ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలో.. క్షణికావేశంలో అహ్మద్ను క్రాంతి కత్తితో పొడిచింది. గాయం కారణంగా రక్తం చాలా పోవడంతో అహ్మద్ ఫ్లోర్ మీదే కుప్పకూలిపోయాడు. క్రాంతి భయంతో అరిచి కేకలేయడంతో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి అహ్మద్ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి చేరుకునే లోపే చాలా రక్తం పోవడంతో అహ్మద్ చనిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.