హైదరాబాద్ సిటీలో అమెరికా ఏరియా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది అమీట్ పేట. ప్రపంచంలో ఏ మూలన ఏ ఐటీ కోర్సు కొత్తగా వచ్చినా.. అమీర్ పేటలో కోచింగ్ సెంటర్ ఓపెన్ అయిపోతుంది. హైదరాబాద్ అమీర్ పేట మైత్రివనం అంటే ఫుల్ క్రౌడ్.. 24 గంటలూ రష్.. మైత్రీవనం పక్కనే ఓ పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఉంటుంది. ఇందులో ఐటీ కోచింగ్ సెంటర్లు బోలెడు ఉంటాయి..ఇందులో నీలగిరి బ్లాక్ లో.. 2026, ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం.. ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలు కమ్మేశాయి. హైదరాబాద్ అమీర్ పేట మెట్రో స్టేషన్ పక్కనే ఉండే ఈ నీలగిరి బ్లాక్ లో మంటలతో.. అమీర్ పేట అంతా కలకలం రేగింది.
హైదరాబాద్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే అమీర్ పేట్ లోని మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం (ఫిబ్రవరి 20) మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో ఫైర్ యాక్సిడెంట్ కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వెలువడుతుండటంతో జనాలు బయటికి పరుగులు తీశారు. నీలగిరి బ్లాక్ లో నాలుగవ అంతస్తులోని ఇనిస్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకోవడంతో ఆందోళనకు గురయ్యారు.
ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పైన చిక్కుకున్న వారిని బాల్కనీ నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నిచ్చెల ద్వారా విద్యార్థులను, సిబ్బందిని బయటకు తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది నిచ్చెనల ద్వారా బిల్డింగ్ లోకి ఎంటరై.. మంటలను ఆర్పేశారు.
అత్యంత రద్దీగా ఉండే మైత్రివనం సెంటర్ దగ్గర ప్రమాదం జరగటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పక్కనే మెట్రో స్టేషన్ ఉండటంతో ప్రయాణికులు ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు స్టేషన్ లో గుమిగూడారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మైత్రివనం జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
