ప్రమాదంలో 9 కోట్ల ఐటీ ఉద్యోగాలు.. కోడింగ్ వచ్చినా జాబ్స్ రావన్న ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

ప్రమాదంలో 9 కోట్ల ఐటీ ఉద్యోగాలు.. కోడింగ్ వచ్చినా జాబ్స్ రావన్న ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

ఐటీ రంగంలో AI సృష్టిస్తున్న ప్రకంపనలపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నీలేకని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ అనేది కేవలం ఒక కొత్త సాంకేతికత మాత్రమే కాదని.. అది ఐటీ ఇండస్ట్రీ పునాదులనే మార్చేసే ఒక భారీ విప్లవం అని చెప్పారు. ముఖ్యంగా టాలెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఇప్పుడు అత్యంత కీలకమైనదిగా మారిపోయిందని ఆయన స్పష్టం చేశారు. పాత చింకాయపచ్చటి చందంగా టెక్ కంపెనీలు ఇకపై పనిచేస్తాం అంటే వాటి మనుగడ కష్టమేనని నీలేకని వ్యాఖ్యలు చెబుతున్నాయి. 

కోడింగ్ యుగం ముగిసింది.. 
ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే ప్రధానంగా కోడ్ రాయడమే ఉండేది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదని నీలేకని తేల్చి చెప్పారు. ఇకపై కోడ్ రాయడం అసలైన టార్గెట్ కాదు.. ఏఐ ఏజెంట్లను సరైన పద్ధతిలో పనిచేయించడమే టెక్కీలకు అసలైన టాస్క్. ఏఐ వల్ల పాత పద్ధతుల్లో వ్యాపారాలు సాగవని, కంపెనీలు తమ పనితీరును సమూలంగా మార్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు నీలేకని. గతంలో మొబైల్ లేదా క్లౌడ్ టెక్నాలజీ వచ్చినప్పుడు పాత వాటిపై కొత్త పొరను జోడించినట్లు ఉండేదని.. కానీ ఏఐ మాత్రం వ్యవస్థను మొత్తం రీవైరింగ్ చేసేస్తోందని అన్నారు. 

ఏ జాబ్స్ పోతాయి? ఏవి వస్తాయి?
ఏఐ రాకతో దాదాపు 9 కోట్ల టెక్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నీలేకని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా రిపీటెడ్ టాస్క్స్ చేసే జాబ్స్ కనుమరుగవుతాయని చెప్పారు.

  • పోయే ఉద్యోగాలు: ఫ్రంట్-ఎండ్ వెబ్ డెవలపర్స్, క్వాలిటీ అస్యూరెన్స్ టెస్టర్స్, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్స్, సాధారణ బ్లాక్‌చైన్ డెవలపర్స్ జాబ్ రోల్స్ భారీగా తగ్గుతాయని నీలేకని చెప్పారు.
  • కొత్త అవకాశాలు: అయితే ఇదే సమయంలో 17 కోట్ల మంది టెక్ నిపుణులకు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నీలేకని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కారణంగా.. ఏఐ ఇంజనీర్లు, ఏఐ ఫొరెన్సిక్ అనలిస్ట్‌లు, ఫార్వర్డ్ డెప్లాయిడ్ ఇంజనీర్లు, ఏఐ లీడ్స్ అండ్ డేటా అనోటేటర్ల వంటి సరికొత్త రోల్స్‌కు డిమాండ్ భారీగా పెరుగుతుందని చెప్పారు. అంటే పోతున్న జాబ్స్ కంటే డబుల్ జాబ్స్ ఏఐ వల్ల కొత్తగా క్రియేట్ అవుతున్నాయని తెలుస్తోంది. 

పాత వ్యవస్థలే అసలైన సవాలు..
కొత్త ప్రాజెక్టుల కోసం ఏఐతో కోడ్ రాయడం చాలా సులభమని, కానీ అసలైన సవాలు 'బ్రౌన్‌ఫీల్డ్' అని పిలిచే పాత లెగసీ సిస్టమ్స్‌తోనే ఉందని నీలేకని పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా ఉన్న పాత డేటా.. డాక్యుమెంటేషన్ లేని కోడింగ్ విధానాలను ఆధునీకరించడం అనేది ఒక పాత ఇల్లు కదులుతుండగా దాన్ని బాగు చేయడం లాంటిదని అభివర్ణించారు. కంపెనీలు తమ టెక్నికల్ డెట్ వదిలించుకోవడానికి ఏఐని ఎలా వాడుకుంటాయనే దానిపైనే వాటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఒక్కమాటలో చెప్పారు.

సో రానున్న కాలంలో ఏఐ వల్ల అవకాశాలకు కొదవ లేదని, అయితే దాన్ని అమలు చేయడంలోనే అసలైన రిస్క్ ఉందని ఆయన హెచ్చరించారు. ప్రతి సంస్థా ఏఐని సమర్థవంతంగా అమలు చేయలేకపోవచ్చు. ఉద్యోగులకు కేవలం కొత్త టూల్స్ నేర్పించడం కాకుండా.. వారి ఆలోచనా దృక్పథాన్ని మార్చడంపై కంపెనీలు దృష్టి సారించాలని సూచించారు. భవిష్యత్తులో అత్యంత కష్టపడి పనిచేసే వారి కంటే.. మార్పులకు సంసిద్ధంగా ఉన్న వారికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నందన్ నీలేకని సూచిస్తున్నారు.