భైంసా నుంచి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్

భైంసా నుంచి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్

 

  • ముఠా గట్టు రట్టు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు
  • కీలక నిందితుడు ప్రణయ్ షిండే అరెస్ట్
  • చెక్​బుక్​లు, డెబిట్ కార్డులు స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిర్మల్ జిల్లా భైంసా కేంద్రంగా బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న ముఠాలోని కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 3 బ్యాంక్ అకౌంట్స్, 43 చెక్​బుక్స్, 30 ఏటీఎం కార్డులు, 2 సెల్​ఫోన్లు, 8 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. భైంసా పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు, పేదల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నట్టు గుర్తించామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌‌‌‌ తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన ప్రణయ్‌‌‌‌ షిండే (26) మరికొంత మందితో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. సైబర్ నేరగాళ్లకు అందించేందుకు బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్ క్రియేట్ చేసేవాడు. దీని కోసం భైంసా మండలం చుట్టుపక్క గ్రామాల రైతులు, పేదలను టార్గెట్ చేసుకున్నాడు. వారి నుంచి బ్యాంక్ అకౌంట్స్​కు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించేవాడు. కమీషన్ ఆశచూపి వారి పేర్లతో 125కు పైగా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొరియర్​లో పంపిన సిమ్ కార్డులతో బ్యాంక్ అకౌంట్స్ కు లింక్ చేసేవాడు. ఎస్ఎంఎస్ అలర్ట్ సహా పాస్​బుక్స్, చెక్​బుక్స్, డెబిట్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లను తమ వద్దే పెట్టుకున్నాడు. వీటిని సైబర్ నేరగాళ్లకు సప్లయ్ చేసేవాడు.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్రికెట్ బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ..

ప్రణయ్‌‌‌‌ షిండే ఆన్‌‌‌‌లైన్ క్రికెట్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టేవాడు. టెలిగ్రామ్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా సైబర్ నేరగాళ్లతో కలిసి బెట్టింగ్‌‌‌‌కు ప్లాన్ చేశాడు. ఆన్‌‌‌‌లైన్ క్రికెట్‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌ ప్రమోట్‌‌‌‌ చేస్తూ కస్టమర్లతో బెట్టింగ్ నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ అందించడం ప్రారంభించాడు. ప్రణయ్‌‌‌‌ సప్లయ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌తో సైబర్ నేరగాళ్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మోసాలకు పాల్పడేవాళ్లు. బెట్టింగ్‌‌‌‌ సహా ఇతర సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాల ద్వారా వచ్చిన డబ్బులు అకౌంట్స్‌‌‌‌లో డిపాజిట్ అయ్యాక ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్స్ చేసుకునేవారు. రాష్ట్రంలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల్లో నిర్మల్‌‌‌‌ జిల్లా బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ను పోలీసులు గుర్తించారు. ప్రణయ్‌‌‌‌ ఇచ్చే సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.