యువ ఎమ్మెల్యేలకు టాస్క్ .. ప్రతిష్ఠాత్మకంగా మారిన పార్లమెంట్​ఎన్నికలు

యువ ఎమ్మెల్యేలకు టాస్క్ .. ప్రతిష్ఠాత్మకంగా మారిన పార్లమెంట్​ఎన్నికలు
  • అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ సాధించాలని టార్గెట్​ 
  • మంత్రి ఉత్తమ్, జానారెడ్డి డైరెక్షన్​లో నల్గొండ ఎన్నికలు
  • భువనగిరిలో ఎమ్మెల్యే రాజగోపాల్​ రెడ్డిపైనే భారం

నల్గొండ, వెలుగు: నల్గొండ, భువనగిరి పార్లమెంట్​ఎన్నికలు కాంగ్రెస్ ​యువ ఎమ్మెల్యేలకు పెద్ద టాస్క్​గా మారాయి. తొలిసారి కాంగ్రెస్​ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి పెట్టాలని సీఎం రేవంత్​ రెడ్డి టార్గెట్​పెట్టారు. ఎన్నికల ఇన్​చార్జిలుగా వ్యవహారిస్తున్న మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సైతం అభ్యర్థుల గెలుపును చాలెంజ్​గా తీసుకున్నారు. ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు రఘువీర్​ రెడ్డి, చామల కిరణ్​ కుమార్​ రెడ్డి సీఎంకు సన్నిహితులు కావడంతో.. వారిని మెజార్టీతో గెలిపిస్తే  భారీగా నిధులు రాబట్టుకొని నియోజకవర్గాలను బాగు చేసుకోవచ్చని కొత్త ఎమ్మెల్యేలు అభిప్రాయంలో ఉన్నారు. 

భువనగిరిలో ఇలా.. 

భువనగిరి పార్లమెంట్​పరిధిలో ఆలేరు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు తొలిసారిగా కాంగ్రెస్​ నుంచి గెలుపొందారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఏకంగా 68 వేల మెజార్టీ వచ్చింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వీరేశానికి ఎంపీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉంది. కొత్త ఎమ్మెల్యేలే గట్టిగా కష్టపడాల్సి వస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీకి భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లోనే ఎక్కు వ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఇక్కడ మూడు లక్షల మెజార్టీ రావాలని సీఎం రేవంత్​ టార్గెట్​పెడితే.. రాజగోపాల్​ రెడ్డి ఏకంగా నాలుగు లక్షల మెజార్టీ సాధిస్తామని చాలెంజ్​ చేశారు.

 ఈ లెక్కన ఒక్క నియోజకవర్గంలో కనీసం 57 వేల పైగా మెజార్టీ సాధించాలి. ఈ నాలుగు సెగ్మెంట్లు కూడా మూసీ నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి.  ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే మూసీ ప్రక్షాళన చేయిస్తామని, గోదావరి జలాలను భువనగిరి, చిట్యాల, చౌటుప్పుల్​ వరకు తీసుకొస్తామని ఇన్​చార్జి రాజగోపాల్​ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఒకరకంగా తానే ఎంపీగా పోటీ చేస్తున్న ట్టుగా కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో భారీ మెజార్టీ సాధించే దిశగా ఎమ్మెల్యే లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బూత్​ల వారీగా ఎన్నికల ప్రచారం స్పీడప్​ చేశారు. పార్టీలో చేరికలు ప్రోత్సహిస్తున్నారు. 

నల్గొండలో నల్లేరు మీద నడకే...

నల్గొండ ఎంపీ సెగ్మెంట్​పరిధిలో మిర్యాలగూడ, నాగార్జునసాగర్​ఎమ్మెల్యేలు తొలిసారిగా గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికలను బత్తుల లక్ష్మారెడ్డి, జానారెడ్డి కొడుకు జైవీర్​ రెడ్డి సవాల్​గా తీసుకున్నారు. నాగార్జునసాగర్​లో తన కంటే అన్నకు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తానని జైవీర్​ శపథం చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలో ప్రత్యర్థుల కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అందరిని కాంగ్రెస్​లో కలిపేసుకున్నారు. మం త్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బత్తుల లక్ష్మారెడ్డి ఈ ఎన్నిక ల్లో కష్టపడితే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో మిర్యాలగూడ అభివృద్ధికే సింహాభాగం కేటాయిస్తామని హామీ ఇస్తున్నారు. 

పార్టీ సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించినట్టుగానే ఎంపీ ఎన్నికల్లో నల్గొండ దేశంలో అగ్రస్థానంలో ఉంటుదని చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జానారెడ్డి తన కొడుకు గెలుపు కోసం ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టులు, ఇతర పా ర్టీ సీనియర్లతో జానారెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి కొడుకు అమిత్ పార్టీలోకి రావడం రఘువీర్​కు, కిరణ్​ కుమార్​ రెడ్డికి మరింత కలిసొచ్చింది.