డేవిడ్ వార్నర్ పై ఫ్యాన్స్ మీమ్స్

డేవిడ్ వార్నర్ పై ఫ్యాన్స్ మీమ్స్

హైదరాబాద్: కరోనా మహమ్మారి బెడద లేకుండా పరిస్థితులు సాధారణంగా ఉండుంటే ఈ ఏడాది వేసవిలో క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ తో ఎంటర్ టైన్ అయ్యేవారు. ఇటు సినిమాలు అటు ఐపీఎల్ లేకపోవడంతో.. లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమవడంతో సినీ, క్రికెట్ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. వీరిని ఎంటర్ టైన్ చేయడానికి ఫిల్మ్ స్టార్స్, క్రికెటర్లు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కానీ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ బాధ్యతలను మాత్రం ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తీసుకున్నాడు.

ఐపీఎల్ లో తెలుగు జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున దుమ్మురేపే వార్నర్ .. నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు ఉత్సాహం కల్పించేందుకు టిక్ టాక్ వీడియోస్ చేస్తున్నాడు. రీసెంట్ తెలుగు హిట్ సాంగ్స్ కు తన భార్య, కూతురుతో కలసి వార్నర్ వేస్తున్న అదిరిపోయే స్టెప్స్ కు సోషల్ మీడియా ఊగిపోతోంది.

ఈమధ్య పోకిరి మూవీలోని మహేశ్ డైలాగ్ తో వార్నర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సన్నజాజి ట్యూన్ కు వార్నర్ వేసిన డ్యాన్స్ కూడా తెగ వైరల్ అయింది. వార్నర్ ను స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో మరి.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ కూడా రాములో రాములా పాటకు డ్యాన్స్ చేస్తూ అలరించే ప్రయత్నం చేశాడు.

ఇలా విదేశీ క్రికెటర్లు తెలుగు పాటలకు డ్యాన్సులు చేస్తూ, పంచ్ డైలాగులు చెబుతూ బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు.

వైరల్ అవుతున్న మీమ్స్
డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియో సాంగ్స్, పంచ్ డైలాగులకు తెలుగు జనం తెగ ఆనందిస్తున్నారు. వార్నర్ పై తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ చేస్తున్న మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డేవిడ్ భాయ్ పేరుతో వార్నర్ మూవీ చేయనున్నట్లు ఓ పోస్టర్ వాట్సాప్ లో బాగా షేర్ అవుతోంది. ఉప్పల్ స్టేడియంలో సెంచరీలు కొట్టాల్సినోడు ఉప్పల్ బాలులా తయారయ్యాడు అని మరో మీమ్ కూడా ఆకర్షిస్తోంది. రాములో రాములా పాటకు పీటర్సన్ వేసిన స్టెప్స్ కు ఏం డ్యాన్స్ ఇది అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్ జనాలను తెగ నవ్విస్తోంది.