ఈ నెలంతా ఎండలే... జాడ లేని రుతుపవనాలు ఇంకో వారం లేట్​

ఈ నెలంతా ఎండలే... జాడ లేని రుతుపవనాలు ఇంకో వారం లేట్​
  • జూన్​ 15 దాటినా దడపుట్టిస్తున్న ఎండలు, వడగాడ్పులు
  • మరో మూడు రోజులు 13 జిల్లాల్లో హీట్​ వేవ్స్​
  • రుతుపవనాల ఎంట్రీకి బిపర్​జాయ్​ తుఫాన్​ బ్రేకులు

హైదరాబాద్​, వెలుగు:  మే నెలంతా ఎండలతో సతమతమయ్యే జనానికి జూన్​ రాంగనే కొంత ఊపిరి పీల్చుకున్నట్లనిపిస్తది. రుతుపవనాలు ఎంటరయ్యి, ఎండ మంట తగ్గి తొలకరి పలకరిస్తది!! కానీ, ఈ సారి వాతావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఈ ఏడాది మే నెలంతా టెంపరేచర్లు సాధారణం కన్నా ఎక్కువే నమోదయ్యాయి. దానికి తోడు  చెడగొట్టు వానలు, వడగండ్లు పడి పంటలను నేలపాలు చేసి రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. మేలో ఎండలు ఎట్ల మండినయో ఇప్పుడు జూన్​ 15 తారీఖు దాటినా అట్లనే మండిపోతున్నాయి. వాస్తవానికి టెంపరేచర్లు జూన్​ మొదటి వారం నుంచి తగ్గాలి. కానీ,  వడగాడ్పులు దడపుట్టిస్తున్నాయి. ప్రధానంగా ఏడెనిమిది జిల్లాల్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. జూన్​ తొలి వారం పూర్తయ్యేనాటికి రావాల్సిన నైరుతి రుతుపవనాల జాడ ఇప్పటికీ కనిపించడం లేదు. బిపర్​ జాయ్​ తుఫాన్​ ఎఫెక్ట్​తో రుతుపవనాల రాకకు ఆటంకాలు కలుగుతున్నాయని, దాదాపు ఈ నెలంతా ఎండలు మండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 

తప్పిన అంచనాలు

నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలోకి ఈ నెల పది నాటికే ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత ఆ అంచనాలను సవరించి 15 నుంచి 20వ తేదీల మధ్య ఎంటరయ్యే చాన్స్​ ఉందని పేర్కొంది. అయితే, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటరయ్యేందుకు ఇప్పటికీ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడలేదని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంటున్నారు. 

పశ్చిమం నుంచి వీచే గాలుల్లో స్తబ్ధత నెలకొందని, బిపర్​జాయ్​ తుఫాన్​ కారణంగా రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ ఆలస్యమవుతున్నదని చెప్తున్నారు. గాలిలోని తేమను మొత్తం తుఫాన్​ లాగేసుకున్నదని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. అయితే.. జూన్​ 18 నుంచి 21 నాటికి రుతుపవనాల రాకకు అనుకూలమైన వాతావరణం ఏర్పడే చాన్స్​ ఉందని అంచనా వేస్తున్నారు. మరో వారం పదిరోజులు గుజరాత్​, దాని సమీప రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ టెంపరేచర్లు, హీట్​వేవ్స్​ పెరిగే ఆస్కారముందని  ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం గుజరాత్, దాని సమీప రాష్ట్రాల్లో బిపర్​ జాయ్​ తుఫాన్​ కొనసాగుతున్నది.

టెంపరేచర్లు ఇట్లనే ఉంటయ్​

రాష్ట్రంలో మరో వారం పది రోజులదాకా ఉష్ణోగ్రతలు ఇదే రేంజ్​లో నమోదవ్వొచ్చని వాతావరణ శాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. గురువారం ఆదిలాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఖమ్మం, మెదక్​, నల్గొండ, నిజామాబాద్​, పెద్దపల్లి జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. రాబోయే మూడు రోజులు ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, కరీంనగర్​, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్​, వరంగల్​, హనుమకొండ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. మొత్తంగా 13 జిల్లాలను హీట్​వేవ్స్​ అలర్ట్​లో ఉంచారు. 

కేరళకూ లేటుగానే వచ్చినయ్​

ఈసారి రుతుపవనాలు కేరళనూ లేటుగానే తాకాయి. ఈ నెల 1నాటికే నైరుతి రుతుపవనాలు అక్కడికి వస్తాయని భావించినా.. వారం రోజులు ఆలస్యమయ్యాయి. రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్న టైంలోనే అరేబియా సముద్రంలో బిపర్​జోయ్​ తుఫాన్​ ఏర్పడి.. ఆ ఆశలకు గండికొట్టింది. జూన్​8న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. రెండు రోజుల కిందటే ఆ రాష్ట్రమంతటా విస్తరించాయి. ప్రస్తుతం తుఫాను ఎఫెక్ట్​తో రుతుపవనాల్లో స్తబ్ధత ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.

ఈ ఏడాది  ఎల్​నినో ఎఫెక్ట్​

ఈ ఏడాది మన దేశంపై ఎల్​నినో ఎఫెక్ట్​ ఉండొచ్చని ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. పసిఫిక్​ సముద్రంలో టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ఈ క్రమంలో ఎల్​నినో  బలపడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఎల్​ నినో ప్రభావం ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతమే నమోదవుతుందని మన వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 

జూన్​లోనే రికార్డ్​ టెంపరేచర్లు

రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఈ జూన్​లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదయ్యాయి. నెల మొదలైన దగ్గర్నుంచి 45 డిగ్రీలకుపైగానే  టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. హనుమకొండ జిల్లా కాజీపేటలో ఈ నెల 9న అత్యధికంగా 48.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే రోజు 7 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే  రికార్డయ్యాయి. 1952లో భద్రాచలంలో 48.6  డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆ తర్వాత ఈ నెల 9న కాజీపేటలో నమోదైనవే హయ్యెస్ట్​. ఈ నెలలో ఇప్పటిదాకా 13 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. గురువారం కరీంనగర్​ జిల్లా తణుగులలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్​, ఓదెలలో 44.9, సూర్యాపేట జిల్లా ఆలంగపురం, ఆసిఫాబాద్​ జిల్లా జంబుగలో 44.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్​, నేరెళ్ల, ఖమ్మం జిల్లా పమ్మిల్లలో 44.1 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.