నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు

నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు

నమ్మిన వాళ్లే మోసం చేస్తే బాధనిపిస్తోంది, తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవారి వల్ల మనసు గాయపడిందంటూ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి తాత్కాలికంగా మేలు కలగవచ్చు కానీ దీర్ఘకాలికంగా న్యాయమే గెలుస్తుందన్నారు. ఈ సారి నేను చాలా కఠినంగా ఉంటాను. తానే బిఫామ్స్ ఇస్తామన్న ఈటల.. జమ్మికుంట, హుజురాబాద్ ప్రజల ఓట్లు అడగడానికి పూర్తి హక్కు దారున్ని తానేన్నారు.

అయితే కరీంనగర్ జమ్మికుంటలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈటల ఈ తరహా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కసితో పనిచేశా 

మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న ఈటల అభ్యర్ధుల ఎంపిక, ఎన్నికల క్యాంపెయినింగ్ గురించి ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ  డబ్బులు, మద్యానికి ఓట్లు పడవని నిజాయితీగా పని చేసే వారికే ప్రజలు ఓట్లు వేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మికుంట, హుజురాబాద్ ప్రజల ఓట్లు అడగడానికి పూర్తి హక్కు తనకే ఉందని వ్యాఖ్యానించారు.   సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల తాగు నీటి కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని, ఆ కసి తోనే మంత్రి కాగానే ఒక్కో పట్టణానికి 40 కోట్లు కేటాయించిన  ఘనతే తనకే దక్కుతుందని గుర్తు చేశారు.

 నాయకుల గెలుపుకు కార్యకర్తలే కారణం

ఎమ్మెల్యే, ఎంపీ కంటే కౌన్సిలర్ గా గెలవడం కష్టమన్న మంత్రి .. కష్టపడండి, నీతి నిజాయితీగా పని చేయండి…గుణగణాలు చూసి ప్రజలు ఓటు వేస్తారన్నారు.  ధర్మoగా కొట్లాడడం మాత్రమే తెలుసని, దొంగ దెబ్బతీయడం చేతకాదని చెప్పారు. నమ్మకద్రోహం చేసే వారు బాగుపడరని చురకలంటించారు.   క్యాంపు రాజకీయాలు చేయడం తన వల్లకాదన్న ఈటల నాయకులను గెలిపించేందుకు కార్యకర్తలు ఎంత కష్టపడతారో తనకు తెలుసన్నారు.  తమ లీడర్ ను గెలిపించుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తారని కార్యకర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రజలు ధర్మం తప్పితే నేను గెలిచే వాణ్ని కాదు

అమ్ముడు పోనిది ఆత్మ గౌరవం మాత్రమే.  ప్రజలు ధర్మం తప్పరు. అలా తప్పి ఉంటే మొన్న నేను గెలిచే వాడినే కాదని చెప్పిన ఈటల.. కొంత మంది నాయకులు గెలవక ముందు ఒక విధంగా గెలిచిన తరువాత ఇంకో విధంగా ఉంటారన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉంది.గెలుపు గుర్రాల కే సీట్లు దక్కుతాయని సూచించారు. తాను కొట్లాడినట్లు ఎన్నికలు ఎవరు కొట్లాడలేదు. గడిచిన 18 ఏళ్లలో చాలా అనుభవం వచ్చిందని చెప్పిన ఈటల  మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో తన ప్రమేయం ఉండదన్నారు. రాష్ట్ర యూనిట్ గా రిజర్వేషన్లు కేటాయింపు ఉంటుందని , డబ్బులు ఉంటే టికెట్లు, ఓట్లు వస్తాయని అనుకుంటే పొరపాటు.  ప్రజల అభిమానం ఉంటేనే ఓట్లు పడుతాయని మర్చిపోవద్దని కార్యకర్తలకు,ఆశావాహులకు ఈటల రాజేందర్ దిశానిర్ధేశం చేశారు.