హైదరాబాద్/ కరీంనగర్, వెలుగు: మన వాటా నీటిని ఒక చుక్క కూడా వదులుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్.. ముందు నికర, వరద, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ‘‘తెలంగాణకు ఆనాడు ఉమ్మడి ఏపీలో నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ లు ఏపీకి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాలపై మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి.
వరద జలాల లభ్యతపైన ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయి. అది కూడా మభ్యపెట్టే మాటలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నది’’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు ఆనాడు ట్రిబ్యునల్ లు కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విధంగా మా నీటిని ఒక చుక్క కూడా వదులుకోబోమని తేల్చిచెప్పారు.
నీటికి సంబంధించిన అంశాలపై ఇరురాష్ట్రాలు ఘర్షణ వాతావరణం సృష్టించవద్దన్నారు. మా కోటా.. మా వాటా నీటి వినియోగం పూర్తికాకముందే మీరు వరద జలాల పేరు మీద ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదాన్నారు. మావాటా, రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల హక్కుల కోసం బాజాప్తా మాట్లాడతామని పేర్కొన్నారు.
ఉద్యమ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లు సాధించాలి
తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడినట్లుగా బీసీ కులాలన్నీ జేఏసీలుగా ఏర్పడి అదే ఉద్యమ స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్లు సాధించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తమతో కలిసి ఢిల్లీకి రావాలని బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం సహా పలు రాజకీయ పార్టీలను కోరుతున్నానని తెలిపారు. ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఆదివారం రాత్రి మీడియాతో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన చేశామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, ఎవ్వరూ అడ్డువచ్చినా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఆగదన్నారు. బీసీ రిజర్వేషన్లకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. కొంతమంది కడుపులో కత్తులు పెట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్ కు తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. అయితే.. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేటీఆర్ కూడా తమతో పాటు ఢిల్లీకి రావాలని సూచించారు.

