V6 News

హైవేలపై ఓవర్ లోడ్ వాహనాలకు చుక్కలే.. ఏప్రిల్ 15 నుంచి కొత్త పెనాల్టీ రూల్స్ ఇవే..

హైవేలపై ఓవర్ లోడ్ వాహనాలకు చుక్కలే.. ఏప్రిల్ 15 నుంచి కొత్త పెనాల్టీ రూల్స్ ఇవే..

MoRTH Overload Fee: నేషనల్ హైవేలపై ప్రయాణించే భారీ వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ(MoRTH) గట్టి షాక్ ఇచ్చింది. ఓవర్ లోడ్‌తో రోడ్లను పాడుచేసే వాహనాలపై కఠినంగా వ్యవహరించేందుకు సరికొత్త రూల్స్‌ను అమలులోకి తెచ్చింది. ఈ రోజు అంటే ఏప్రిల్ 15 నుంచే ఈ "నేషనల్ హైవేస్ ఫీ ఫోర్త్ అమెండ్‌మెంట్ రూల్స్-2026" అమల్లోకి వస్తున్నాయి. ఇకపై హైవేలపై పరిమితికి మించి లోడ్ తీసుకెళ్తే జేబు ఖాళీ అవ్వడం ఖాయం. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. టోల్ ప్లాజాల వద్ద ఓవర్ లోడ్ శాతాన్ని బట్టి టోల్ ఫీజును వసూలు చేస్తారు.

అర్థమయ్యేలా చెప్పాలంటే.. అనుమతించబడిన బరువు(GVW) కంటే 10 శాతం లోపు ఓవర్ లోడ్ వాహనంలో ఉన్నట్లయితే ఎటువంటి అదనపు ఫీజు వసూలు చేయరు. అయితే అనుమతికి మించి ఓవర్ లోడ్ అంటే 10 శాతం నుంచి 40 శాతం మధ్యలో ఉంటే.. సాధారణ టోల్ రేటు కంటే రెండు రెట్లు(2x) ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ లోడ్ 40 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఏకంగా నాలుగు రెట్లు(4x) బాదుడు తప్పదు. ఈ లెక్కలన్నీ టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన సర్టిఫైడ్ వెయిట్ మెషీన్ల ద్వారానే నిర్ణయిస్తారు. ఒకవేళ ప్లాజా వద్ద బరువు తూచే యంత్రాలు లేకపోతే.. వాహనదారుడి నుంచి ఓవర్ లోడ్ ఫీజు వసూలు చేసే అధికారం టోల్ ఏజెన్సీలకు ఉండదు.

ఇక్కడ మరో కీలకమైన మలుపు ఏంటంటే.. ఈ అదనపు వసూళ్లు అన్నీ కేవలం FASTag ద్వారానే జరుగుతాయి. దీనివల్ల టోల్ ఏజెన్సీలు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం లేదా ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపడం అస్సలు కుదరదన్నమాట. ఓవర్ లోడ్ అయిన ప్రతి వాహన సమాచారాన్ని టోల్ ప్లాజాలు తప్పనిసరిగా ప్రభుత్వ Vahan పోర్టల్‌లో ఎంటర్ చేయాలి. దీనివల్ల రవాణా శాఖ అధికారులు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం విడిగా భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అంటే టోల్ ప్లాజా వద్ద కట్టేది కేవలం యూజర్ ఛార్జీ మాత్రమే.. అసలు జరిమానా వేరేగా ఉంటుంది.

►ALSO READ | కొత్త సీఈఓ రాకతో డిస్నీ ఉద్యోగులకు కష్టాలు.. 1000 మందిని పీకేస్తానంటూ మెయిల్స్..

మోటార్ వెహికల్ యాక్ట్-2019 ప్రకారం.. ఓవర్ లోడ్ వాహనాలకు కనీసం రూ.20వేల జరిమానా ఉంటుంది. దీనికి అదనంగా ప్రతి ఎక్స్‌ట్రా టన్నుకు మరో రూ.2వేలు చొప్పున ఫైన్ విధిస్తారు. అంటే కొత్త రూల్స్ వల్ల అటు టోల్ ప్లాజా వద్ద 4 రెట్లు బాదుడుతో పాటుగా.. ఇటు రవాణా శాఖ విధించే ఓవర్ లోడ్ జరిమానాలు కలుపుకుని వాహనదారులకు పెద్ద షాక్ తగలనుంది. హైవేల మౌలిక సదుపాయాలను కాపాడటం, రోడ్డు భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుందట. ఇకపై పరిమితికి లోబడే లోడ్ తీసుకెళ్లడం వాహనదారులకు క్షేమం అలాగే లాభం కూడా. 

ఓవర్ లోడ్ ఛార్జీలు ఇలా..

ఓవర్ లోడ్ వాహనాలపై కొత్త బాదుడు ఎలా ఉంటుందో ఈ ఉదాహరణతో తెలుసుకోండి. ఒక ట్రక్కు అనుమతించబడిన బరువు 20 టన్నులు, దాని సాధారణ టోల్ ఫీజు రూ. 500 అనుకుందాం. ఈ లిమిట్స్ దాటితే అదనంగా ఎంత కట్టాల్సి వస్తుందో ఇప్పుడు చూస్దాం..

*10% వరకు అదనపు లోడ్: 22 టన్నుల వరకు ఉంటే జరిమానా ఉండదు. కేవలం రూ.500 కడితే సరిపోతుంది.
* 10% - 40% లోపు: 25 టన్నుల బరువు ఉంటే.. టోల్ ఫీజు 2 రెట్లు అవుతుంది. అంటే రూ.1,000 వసూలు చేస్తారు.
* 40% పైగా లోడ్: 30 టన్నుల బరువు ఉన్నట్లయితే టోల్ ఫీజు 4 రెట్లు.. అంటే రూ.2,000 కట్టాల్సిందే.

పైన ఇచ్చినది జస్ట్ ఓవర్ లోడ్ పై విధించే టోల్ ఛార్జీలు మాత్రమే. దీనికి అదనంగా 'వాహన్' పోర్టల్ ద్వారా రవాణా శాఖ రూ.20వేలు బేసిక్ ఫైన్, ప్రతి ఎక్స్‌ట్రా టన్నుకు రూ.2,000 చొప్పున జరిమానా విధిస్తుంది. అంటే 30 టన్నుల లోడ్‌కు మొత్తం రూ.42వేల వరకు కట్టాల్సి ఉంటుంది. సో ఇంత భారీ ఫైన్స్ కట్టకుండా ఉండాలంటే తప్పకుండా ఓవర్ లోడ్ లేకుండా చూసుకోవటమే మంచిది మరి.