V6 News

కొత్త సీఈఓ రాకతో డిస్నీ ఉద్యోగులకు కష్టాలు.. 1000 మందిని పీకేస్తానంటూ మెయిల్స్..

కొత్త సీఈఓ రాకతో డిస్నీ ఉద్యోగులకు కష్టాలు.. 1000 మందిని పీకేస్తానంటూ మెయిల్స్..

వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎంటర్‌టైన్మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీలో ఇప్పుడు లేఆఫ్స్ కలకలం మెుదలైంది. సంస్థ కొత్త సీఈఓ జోష్ డి అమారో  బాధ్యతలు చేపట్టిన కేవలం నెల రోజుల్లోనే ఈ భారీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు అమారో మంగళవారం ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశారు. కంపెనీని మరింత చురుగ్గా మారేందుకు, టెక్నాలజీని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తప్పలేదని మెయిల్‌లో పేర్కొన్నారు.

ఎవరు ప్రభావితం అవుతారు?
ఈ సారి లేఆఫ్స్ ప్రధానంగా డిస్నీకి చెందిన మార్కెటింగ్ విభాగాన్ని దెబ్బతీయనున్నాయి. గత జనవరిలో కంపెనీ తన మార్కెటింగ్ విభాగాలన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చి ‘ఎంటర్‌ప్రైజ్ మార్కెటింగ్ డివిజన్’ ఏర్పాటు చేయడంతో.. అక్కడ అదనంగా ఉన్న ఉద్యోగాలను ఇప్పుడు తొలగిస్తున్నారు. వీటితో పాటు డిస్నీ ఫిల్మ్ స్టూడియోలు, టీవీ నెట్‌వర్క్‌లు, ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ ESPN, ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ విభాగాలు, కార్పొరేట్ గ్రూపుల్లోని ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది.

లేఆఫ్స్‌కు అసలు కారణాలేంటి?
సంస్థను రీస్ట్రక్చర్ చేయటమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. మారిన వినోద ప్రపంచంలో సాంప్రదాయ టీవీ వ్యాపారం తగ్గిపోవడం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడం.. అమెజాన్, యూట్యూబ్ లాంటి టెక్ దిగ్గజాల నుంచి పోటీ పెరగడం డిస్నీని ఆర్థికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. స్ట్రీమింగ్ రంగంలో లాభాలను పెంచుకోవడానికి కంపెనీ తన వనరులను తిరిగి కేటాయించాలని భావిస్తోంది. 2022 నుంచి ఇప్పటివరకు డిస్నీ దాదాపు 8వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించడం మీడియా రంగంలో ఆందోళనలు పెంచేస్తోంది.