గ్రేటర్ వాసులకు గుడ్ న్యూస్. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఈ నెలంతా(ఏప్రిల్ 30)ఎర్లీ బర్డ్ స్కీం అందుబాటులో ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఏప్రిల్ నెలలోపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి 5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
ఇప్పటివరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా మొత్తం 261 కోట్ల రూపాయలు వసూలయ్యాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 93 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 106 కోట్లు, మల్కాజిగిరి పరిధిలో 61 కోట్లు వసూలైనట్లు ఆయన తెలిపారు.
పన్ను చెల్లింపుదారులు మై జీహెచ్‌ఎంసీ మై క్యూర్ యాప్ లేదా మీసేవ ద్వారా తమ ట్యాక్స్ చెల్లించవచ్చు. గతంలో యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయని, సాఫీగా చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
►ALSO READ | హైవేలపై ఓవర్ లోడ్ వాహనాలకు చుక్కలే.. ఏప్రిల్ 15 నుంచి కొత్త పెనాల్టీ రూల్స్ ఇవే..
నగరంలో మొత్తం 11 లక్షల 47 వేల ప్రాపర్టీలు ఉండగా అందులో సుమారు 8.8 లక్షలు నివాస గృహాలు, 2.6 లక్షలు వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,166 కోట్లు, మూడు కార్పొరేషన్ల పరిధిలో కలిపి 2,800 కోట్ల రూపాయల పన్ను వసూలే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ ప్రాపర్టీల ట్యాక్స్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ తెలిపారు.
ఇందులో భాగంగా ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇక మూడు కార్పొరేషన్ల అప్పుల విభజనపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించామని, దీనిపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.

