V6 News

డాక్టర్ హైటెక్ వేషాలు..బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ మాయం.. 

డాక్టర్ హైటెక్ వేషాలు..బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ మాయం.. 
  •     విచారణలో విస్తుపోయే నిజాలు

జూబ్లీహిల్స్, వెలుగు: బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్లను మార్చే ప్రత్యేక ఎలక్ట్రానిక్ డివైస్​ను వాహనానికి అమర్చిన డాక్టర్ గౌతమ్ రెడ్డి (29)ని బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుల విచారించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అశోక్ నగర్​కు చెందిన గౌతమ్ రెడ్డి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్​గా పనిచేస్తూ లగ్జరీ కార్లపై ఆసక్తి పెంచుకున్నాడు. ఢిల్లీలో రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు. అయితే, వాటిని తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని భావించి ఈ అడ్డదారి తొక్కాడు.

ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కారులో బటన్ నొక్కగానే నంబర్ ప్లేట్ ఆటోమేటిక్​గా మారిపోయే డివైస్​ను అమర్చి కొన్నాళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. గత శనివారం రాత్రి జూబ్లీహిల్స్​లోని ఓ పబ్ నుంచి మద్యం సేవించి బయటకు వచ్చిన గౌతమ్ రెడ్డిని పోలీసులు ఆపి తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది. ఇంటి దగ్గర ఉండే మరో బీఎండబ్ల్యూ కారుకు కూడా ఇలాంటి డివైస్​నే అమర్చినట్లు విచారణలో అంగీకరించాడు. మొదట కొద్దిరోజులు ఇలా తిరుగుతున్నప్పటికీ ఎవరూ గుర్తుపట్టకపోవడంతో దాన్నే కంటిన్యూ చేశానని పేర్కొన్నాడు.