సికింద్రాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 16 నుంచి వార్డు(డివిజన్) స్థాయి పాలనకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో బుధవారం వార్డు స్థాయి పరిపాలనపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మొత్తం150 వార్డు ఆఫీసులు ప్రారంభించాలని నిర్ణయించామని, నిర్మాణ పనులు పూర్తయిన బిల్డింగుల్లో మాత్రమే ఈ నెల16 న ఆఫీసులు ప్రారంభం అవుతాయని, మిగిలిన వాటి పనులు పూర్తి చేసి త్వరలోనే ఓపెన్ చేస్తామని వెల్లడించారు.
వార్డు ఆఫీసుల ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని చెప్పారు. అన్నిచోట్ల 16న ఉదయం 8:30 గంటలకు ఆఫీస్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభించాక ప్రతివార్డు ఆఫీసును జోనల్ కమిషనర్ వారం వారం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్‌కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ జీయాఉద్దిన్, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్, మమత, పంకజ, సామ్రాట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

