
ఫెమీనా మిస్ ఇండియా 2019 కిరీటం రాజస్థాన్ అమ్మాయి సుమన్ రావ్ సొంతమైంది. గత ఏడాది మిస్ ఇండియా అయిన తమిళనాడుకు చెందిన అనుకీర్తి వ్యాస్ ఆమెకు కిరీటం పెట్టారు. ఇక, ఫస్ట్ రన్నరప్‌గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన శివానీ జాధవ్ నిలిచారు. ఆమెనే మిస్ గ్రాండ్ ఇండియా 2019 కిరీటాన్ని అందుకున్నారు. బీహార్‌కు చెందిన శ్రేయా శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా నిలిచారు. తెలంగాణ అమ్మాయి సంజనా విజ్ రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నారు. ముంబైలోని ఎన్ఎస్సీఐ ఎస్వీపీ స్టేడియంలో శనివారం రాత్రి ఫైనల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కత్రినా కైఫ్, దియా మీర్జా, కరణ్ జోహార్, మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ వంటి తారలు హాజరయ్యారు. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌కు చెందిన సుమన్ రావ్ 1999 నవంబర్ 23న జన్మించారు. రాజస్థాన్‌లో పుట్టినా పెరిగిందంతా ముంబైలోనే. తర్వాత ఢిల్లీలో బీకాం చదివారు. ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) చదువుతున్నారు. ఆమె మంచి కథక్ డాన్సర్ కూడా. పోటీల్లో భాగంగా జెండర్ అసమానత్వంపై ఆమె మాట్లాడారు. ‘‘నేను లింగ అసమానత్వం ఉన్న కమ్యూనిటీ నుంచే వచ్చాను. ఇప్పటికీ కమ్యూనిటీలో అది అలాగే ఉంది. నా ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆ రూల్స్ ఫాలో కావడం, లేదా వాటిని మార్చడం. నేను మార్చడానికే నిర్ణయించుకున్నా” అని చెప్పారు. సుమన్ రావ్ 56వ మిస్ ఇండియా వరల్డ్. థాయ్‌లాండ్‌లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ఆమె పోటీ చేయనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ఆ దేశ రాజధాని బ్యాంకాక్‌లోని పట్టాయాలో పోటీలు జరుగుతాయి. రన్నరప్ సంజనా విజ్‌కు ఏపీజే అబ్దుల్ కలాం అంటే అభిమానం. సొంతూరు ఢిల్లీ అయినా తెలంగాణలో స్థిరపడ్డారు. డాన్స్, యాక్టింగ్, బాస్కెట్‌బాల్, షూటింగ్ అంటే ఇష్టం. సీఆర్పీఎఫ్ పబ్లిక్ స్కూల్లో ఆమె స్కూలింగ్ చేశారు. అమిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీలో డిగ్రీ చదివారు. 30 రాష్ట్రాల నుంచి (కేంద్ర పాలిత ప్రాంతాలు సహా) 30 మంది కంటెస్టెంట్లు గ్రాండ్ ఫినాలేలో కిరీటం కోసం పోటీ పడ్డారు. వాళ్లందరికీ 40 రోజుల పాటు కఠినమైన శిక్షణ ఇచ్చారు. మిస్ ఇండియా పోటీల కోసం అన్ని రాష్ట్రాల్లో ఫెమీనా బ్యూటీ కాంటెస్ట్‌లు పెడుతుంది. అందులో నెగ్గిన వారిని మిస్ ఇండియా పోటీలకు ఎంపిక చేస్తుంది. ప్రముఖ డిజైనర్ దంపతులు ఫాల్గుణి, షేన్ పీకాక్, మిస్ వరల్డ్ 2018 వానెస్సా పోన్సా డి లియోన్ (మెక్సికో), బాలీవుడ్ హీరోయిన్లు హ్యూమా ఖురేషి, చిత్రాంగద సింగ్, నటుడు, డ్యాన్సర్ రెమో డిసౌజా, అథ్లెట్ ద్యుతీ చంద్, ఫుట్‌బాల్ ప్లేయర్ సునిల్ ఛెత్రి, బాలీవుడ్ యాక్టర్ ఆయుష్ శర్మలు జడ్జిలుగా వ్యవహరించారు.