దుమ్మురేపుతున్న మిత్రో యాప్ ..30 రోజుల్లో 50 లక్షల డౌన్ లోడ్స్

దుమ్మురేపుతున్న మిత్రో యాప్ ..30 రోజుల్లో 50 లక్షల డౌన్ లోడ్స్

షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌‌.. టిక్‌‌టాక్‌‌కు మనదేశంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు దానికి కాంపిటీషన్‌‌గా  మరో యాప్ వచ్చింది. దాని పేరే మిత్రో’. ఇది మొదలైన నెల రోజులకే యాభై లక్షల డౌన్‌‌లోడ్స్‌‌ను దాటింది.

ఐఐటీ రూర్కీ స్టూడెంట్ శివాంక్‌‌ అగర్వాల్‌‌ క్రియేట్ చేసిన ‘మిత్రో’ యాప్‌‌ ఇప్పుడు ట్రెండింగ్‌‌లో ఉంది. నెల రోజుల క్రితం విడుదలైన ఈ యాప్‌‌ను ఇప్పటికే 50 లక్షలమందికి పైగా డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నారు. ప్రపంచ స్థాయిలో అత్యంత వేగంగా ఆదరణ పొందిన యాప్‌‌గా మిత్రోకు పేరొచ్చింది.

టిక్‌‌టాక్‌‌కు పోటీగా..

మనదేశంలో టిక్‌‌టాక్‌‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అయితే రీసెంట్‌‌గా యూట్యూబర్స్‌‌కి టిక్‌‌టాక్ యూజర్స్‌‌కి మధ్య ఇష్యూ జరిగిన తర్వాత టిక్‌‌టాక్‌‌ రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. 4.6 కు పైనే ఉండే ఈ రేటింగ్ 1.7 కు పడిపోయింది. తర్వాత గూగుల్.. నెగెటివ్ కామెంట్స్, రేటింగ్స్‌‌ను సరిచేయడంతో మళ్లీ రేటింగ్స్ ఎప్పటిలా ఉన్నాయి.  అయితే ఇలాంటి ఇష్యూలు టిక్‌‌టాక్‌‌కు కొత్తేమీ కాదు.

ఇలా పాపులర్

ఏదో ఒక ఇష్యూతో టిక్‌‌టాక్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. టిక్‌‌టాక్‌‌ను బ్యాన్ చేయాలని కొందరు, దానివల్ల చైనాకు కోట్ల లాభం ఉందని ఇంకొందరు, టిక్‌‌టాక్‌‌లో అన్ సెన్సార్డ్ కంటెంట్ ఉంటుందని మరికొందరు. ఇలా టిక్‌‌టాక్‌‌పై ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. మధ్యలో కొన్ని సార్లు టిక్‌‌టాక్ బ్యాన్ అవ్వడం, మళ్లీ తిరిగి ఓపెన్ అవ్వడం, యూజర్ల అకౌంట్లు బ్లాక్ అవ్వడం, టిక్ టాక్ యూజర్స్, యూట్యూబర్స్ తగువులాడుకోవడం, టిక్‌‌టాక్‌‌ను బ్యాన్ చేయాలని క్యాంపెయిన్లు జరగడం కూడా చూశాం. ఇన్ని ఇష్యూలు జరిగే  టిక్‌‌టాక్‌‌తో ఎందుకనుకున్నారో ఏమో.. సడెన్‌‌గా టిక్ టాక్ యూజర్లందరూ మిత్రోకి షిఫ్ట్ అవుతున్నారు. టిక్‌‌టాక్‌‌ను అన్‌‌ఇన్ స్టాల్ చేసి మరీ మిత్రో యాప్ ఇన్‌‌స్టాల్ చేస్తున్నారు.  దాంతో ఈ యాప్‌‌కు డౌన్‌‌లోడ్స్, రేటింగ్స్ రెండూ పెరిగిపోయాయి. అలాగే లాక్‌‌డౌన్ టైంలో చైనీస్ ప్రొడక్ట్స్ వాడొద్దంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్‌‌లు పెడుతున్నారు. ‘బ్యాన్ టిక్‌‌టాక్’ అనే హ్యాష్‌‌టాగ్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. దాంతో చైనీస్  టిక్‌‌టాక్ కంటే  మిత్రో యాప్‌‌ బెటర్ అని చాలామంది పోస్ట్‌‌లు పెట్టారు. అలా యాంటీ చైనా సెంటిమెంట్ కూడా ఈ యాప్‌‌కు ప్లస్ అయింది.

ఇదిలా ఉంటే మరోపక్క మిత్రో మీద కూడా  ఒక ఇష్యూ రైజ్ అయింది. ఈ యాప్ పాకిస్తానీ యాప్ అంటూ కొన్ని రూమర్లు వచ్చాయి. అసలు విషయమేంటంటే.. ఈ యాప్ సోర్స్ కోడ్ పాకిస్తాన్ యాప్ ‘టిక్ టిక్’ నుంచి తీసుకుని ఇక్కడ డెవలప్ చేశారు. అందుకే  ఇది పాకిస్తానీ యాప్ అన్న రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

ఫీచర్స్ ఇవి

మిత్రో యాప్ అచ్చం  టిక్‌‌టాక్ యాప్ లాగానే ఉంటుంది. అకౌంట్ లేకుండా కూడా స్వైప్ చేస్తూ వీడియోలు చూడొచ్చు. వీడియోలు క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడానికి ఈ యాప్‌‌లో సింపుల్ యాక్సెస్ ఉంటుంది. 8 ఎంబీ కన్నా తక్కువ సైజులో ఉండటం వల్ల స్మార్ట్‌‌ఫోన్లలో తక్కువ స్పేస్ ఉన్నా సరిపోతుంది. ప్రస్తుతానికి మిత్రో యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.  త్వరలోనే యాపిల్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

టాలెంట్ కోసమే..

‘టాలెంట్‌‌ను చూపించుకోడానికి, టాలెంట్‌‌కు హ్యూమర్ టచ్ ఇవ్వడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని, ఎవరికి వాళ్లు ఎంటర్‌‌‌‌టైన్ అవ్వడానికి, ఇతర యూజర్స్‌‌ను  ఎంటర్‌‌‌‌టైన్ చేయడానికి ఈ యాప్ బెస్ట్ ప్లాట్ ఫాం’ అని యాప్ నిర్వాహకులు అంటున్నారు.

పేరు కూడా పాపులర్

అలాగే ఈ యాప్‌‌కు పెట్టిన పేరు కూడా ఇంతటి క్రేజ్ రావడానికి  ఓ కారణం. హిందీలో ‘మిత్రో’ అంటే  ఫ్రెండ్స్ అని అర్థం. ప్రధాని  మోదీ ప్రజలను ఉద్దేశించి ఇచ్చే ప్రతీ స్పీచ్‌‌లోనూ మిత్రో అనే పదం కచ్చితంగా ఉంటుంది. అలా అందరికీ ఈ పదం దగ్గరయిందనేది కొందరి అభిప్రాయం.