కేజ్రీవాల్​ బెయిల్​ పిటిషన్​ను విచారిస్తం : సుప్రీంకోర్టు

కేజ్రీవాల్​ బెయిల్​ పిటిషన్​ను విచారిస్తం :  సుప్రీంకోర్టు
  • ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం
  • బెయిల్​ను వ్యతిరేకించిన ఈడీ
  • ఇది విచారణ మాత్రమే.. బెయిల్ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చన్న సుప్రీం
  • కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధమేనని తేల్చిచెప్పిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ:   లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్​పై ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. మంగళవారం వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాలు సిద్ధం కావాలని సూచించింది. కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఆలస్యం కావచ్చని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన బెంచ్ శుక్రవారం వెల్లడించింది. 

లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్​పై ముందుగా విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేజ్రీవాల్​కు బెయిల్ ఇవ్వరాదని ఈడీ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు కోరారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ‘‘మేం మధ్యంతర బెయిల్ పిటిషన్​ను విచారిస్తామని మాత్రమే చెప్పాం. బెయిల్ ఇస్తామని చెప్పలేదు. వాదనలు విన్న తర్వాత బెయిల్ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు” అని స్పష్టం చేసింది.

అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అమర్ జీత్ గుప్తా అనే లా స్టూడెంట్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో ఒక పొలిటికల్ పార్టీ లీడర్ ను అరెస్ట్ చేస్తే.. ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అయితే, కేజ్రీవాల్ అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని, ఆయన కోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని చీఫ్​ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్‌‌ మీత్ పీఎస్ అరోరాతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. 

పిటిషన్ ను కొట్టివేస్తూ, పిటిషనర్ కు జరిమానా విధించింది. దీనిపై తీర్పు బుధవారమే వెలువడగా, తీర్పు కాపీలోని పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. కేజ్రీవాల్ కు జైలు నుంచే వర్చువల్ గా ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాలని కూడా పిటిషనర్ కోరగా.. ఇంతకుముందు కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలా జైలులో ఉన్న ఖైదీలకు ఎన్నికల ప్రచారం చేసుకునే అవకాశం ఇస్తే.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వంటి కరుడుగట్టిన క్రిమినల్స్ కూడా పార్టీలు పెట్టి జైలు నుంచే ప్రచారం చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కాగా, కేజ్రీవాల్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన మరో పిల్ ను కూడా ఢిల్లీ హైకోర్టు ఇదివరకే తోసిపుచ్చింది.