తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత లేదు... అసత్య ప్రచారాలు నమ్మొద్దు : టీటీడీ క్లారిటీ 

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత లేదు... అసత్య ప్రచారాలు నమ్మొద్దు : టీటీడీ క్లారిటీ 

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యి కొరత ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేసింది టీటీడీ. ఇటీవల కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో టీటీడీ దగ్గర నెయ్యి నిల్వలు లేవని, లడ్డూ ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని అసత్య ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది టీటీడీ.

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి సరఫరా మూడంచెల కొనుగోలు విధానం ద్వారా జరుగుతోందని.. ఒకే సంస్థపై ఆధారపడకుండా మూడు వేర్వేరు సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరుగుతోందని.. ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తినా సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది టీటీడీ.

ఈ క్రమంలో ఇందాపూర్ డైరీ నుండి తిరుమలకు వస్తున్న నెయ్యి ట్యాంకర్ ఇటీవల కడప జిల్లా కొండాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైన విషయం నిజమేనని... అయితే ఒక సంస్థకు చెందిన ట్యాంకర్ ప్రమాదానికి గురైనంత మాత్రాన నెయ్యి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగలేదని స్పష్టం చేసింది టీటీడీ. మిగిలిన రెండు సంస్థల నుండి నెయ్యి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని తెలిపింది. 

ప్రస్తుతం భక్తులకు పంపిణీ చేయడానికి సుమారు 7 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయని... అందువల్ల లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీలో ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని వెల్లడించింది టీటీడీ.

►ALSO READ | తిరుమలకు వెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలు, బకెట్లతో ఎగబడ్డ జనం..

అదేవిధంగా వేసవిలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి పేర్కొంది. లడ్డూ తయారీకి సంబంధించిన పోటు విభాగంలో యంత్రాల నిర్వహణ, కన్వేయర్ బెల్ట్‌లు వంటి పరికరాల మరమ్మత్తులు సంబంధిత సంస్థల ద్వారా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు తెలిపింది టీటీడీ. 

వాస్తవాలు ఇలా ఉంటే.. టిటిడి వద్ద నెయ్యి నిల్వలు లేవని, శ్రీవారి కైంకర్యాలకు మరియు లడ్డూ ప్రసాదాల తయారీకి ఆటంకం కలుగుతోందని అసత్య ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొంది టీటీడీ. ఇటువంటి తప్పుదోవ పట్టించే ప్రచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున ప్రజలు, భక్తులు వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది టీటీడీ.