ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక.. త్వరలో విదేశాలకు ఏపీ నుంచి క్లీన్ ఎనర్జీ ఎగుమతులు: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల ఎంపిక.. త్వరలో విదేశాలకు ఏపీ నుంచి క్లీన్ ఎనర్జీ ఎగుమతులు: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో రూ.5,350 కోట్ల వ్యయంతో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే ఏపీలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం  పెరిగిందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పునరుత్పాదక ఇంధన రంగాన్ని గాడిన పెడుతూ, పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించామని లోకేష్  తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 ద్వారా 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. పత్తికొండలో 400 మెగావాట్ల సౌర విద్యుత్, కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, 1,100 రైతు కుటుంబాలకు మూడు దశాబ్దాల పాటు స్థిరమైన కౌలు ఆదాయం వస్తుందని వెల్లడించారు.

►ALSO READ | సిదిరి అప్పలరాజుతో జగన్ ములాఖత్ నిరాకరణ

టాటా గ్రూప్‌తో దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రభుత్వ విధానంలో వేగం అత్యంత కీలకమని, పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఏపీ తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియాలను యూరప్, జపాన్ దేశాలకు ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నామని, చదువుకుంటూనే సంపాదించేలా శ్రీసిటీలో నూతన యూనివర్సిటీని ప్రారంభించామని లోకేష్ తెలిపారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసే శక్తివంతమైన ఆంధ్రప్రదేశ్‌ను కలిసి నిర్మిద్దామని మంత్రి పిలుపునిచ్చారు.