కాజీపేటలో రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ

కాజీపేటలో రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ
  • హైదరాబాద్​కు ఐఐఎం, ఐటీఐఆర్
  • పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా

హైదరాబాద్, వెలుగు: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, రామగుండం–మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు వంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చింది. 23  ప్రత్యేక హామీలతో కూడిన లోక్​సభ ఎన్నికల రాష్ట్ర మేనిఫెస్టోను కాంగ్రెస్​ శుక్రవారం రిలీజ్ చేసింది. గాంధీ భవన్ లో  జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. 

కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో  “పాంచ్ న్యాయ్”తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో కూడిన ఈ మేనిఫెస్టోను రానున్న వారం రోజుల పాటు ఇంటింటికి తీసుకెళ్లాలని  నేతలు పార్టీ కేడర్​కు సూచించారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ మేనిఫెస్టోను విడుదల చేయాలని పీసీసీ నిర్ణయించింది. అయితే  ఇదే రోజున రాయ్ బరేలీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమం ఉండడంతో రేవంత్ అక్కడికి వెళ్లారు. దీంతో ఈ మేనిఫెస్టోను దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు రిలీజ్ చేశారు. 

కేంద్రంలో అధికారంలోకి  రాగానే హామీలన్నీ అమలు : శ్రీధర్​బాబు

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  తెలంగాణకోసం మేనిఫెస్టోలో పెట్టిన ప్రత్యేక హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన అన్ని అంశాలను  ఇందులో పొందుపరిచామని చెప్పారు. గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షీ తో కలిసి మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం శ్రీధర్​బాబు మాట్లాడారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐఐఎం యూనివర్సిటీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభం, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటులాంటి హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదాతోపాటు ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామాలను తిరిగి తెలంగాణాలో కలుపుతామని చెప్పారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

రాహులే ప్రధాని కావాలంటున్నారు: దీపాదాస్

రాహుల్​గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని దీపాదాస్ మున్షీ అన్నారు.  దేశ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జోడో యాత్ర, న్యాయ యాత్ర చేసిన ఘనత రాహుల్ దేనని చెప్పారు. ఇప్పుడు మోదీకి  రాహుల్ భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. 400  సీట్లు గెలిచి మోదీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేయాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ 14  ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

23 అంశాలతో కూడిన ప్రత్యేక హామీలు ఇవే..

1. హైదరాబాద్ మహా నగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన  ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను పునఃప్రారంభించడం
2 .  ఆంధ్రప్రదేశ్ పునర్​వస్థీకరణ చట్టం -2014 ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాద్​లో  ఐఐఎం,  హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కనుంచి ర్యాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు 
3. భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్​వస్థీకరణ చట్టం- 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు.. ఏటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం, పిచుకలపాడును తిరిగి తెలంగాణలో విలీనం చేయడం 
4. ‘పాలమూరు–రంగారెడ్డి’కి జాతీయ హోదా 
5. హైదరాబాద్​లో నీతి ఆయోగ్ ప్రాంతీయకార్యాలయం  ఏర్పాటు 
6. నూతన ఎయిర్ పోర్టుల ఏర్పాటు
7. రామగుండం–-మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు
8 . నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు
9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు 
10. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
11. జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు
12. ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్  ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటు
13. ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్ టీ) ఏర్పాటు
14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు
15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు
16.అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు
17. 73, 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ
18. ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు 
19. హైదరాబాద్–బెంగళూరు ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్–నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్,  హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్,  హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు 
20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం (ఇంటర్నేషనల్ కల్చరల్, ఎంటర్‌‌టైన్​మెంట్​ హబ్ ) ఏర్పాటు
21. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకుజాతీయ హోదా 
22. డ్రై పోర్టు ఏర్పాటు
23. హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు