ప్రముఖ తెలంగాణ కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ తెలంగాణ కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. వచన కవిత్వం విభాగంలో ఆయన రచించిన అనిమేష కవితా సంపుటికి గాను కేంద్రం ఈ అవార్డు ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ రావడం పట్ల సిధారెడ్డికి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. 

తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గొప్ప గౌరవమని ప్రశంసించారు.  

నందిని సిధారెడ్డి బ్యాగ్రౌండ్:

తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి 1955, జూన్ 12న మెదక్ జిల్లాలోని బందారం గ్రామంలో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో అక్షర యోధుడిగా క్రియాశీల పాత్ర పోషించిన ఆయన హైదరాబాద్‎లోని చారిత్రాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పూర్తి చేశారు. ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు అనే టాపిక్‎పై ఎం.ఫిల్‌ పట్టా పొందారు. 

అనంతరం ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికతపై పరిశోధన చేసి 1986లో పీహెచ్‎డీ పట్టా అందుకున్నారు. ఆయన రాసిన నాగేటి చాల్లల్ల నా తెలంగాణ కవిత అత్యంత ప్రజాదరణ పొందింది. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. 

పాటల రచయితగా నందిని సిధారెడ్డి

నాగేటి సాల్లల్ల నా తెలంగాణ (పోరు తెలంగాణ-2011)
ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. (జై బోలో తెలంగాణ-2011)
పుడమి పండుగ పువ్వుల జాతర (కొలిమి)
ఇది చరిత్ర ఇది పవిత్ర జనవిముక్తి సమరం.. (బందూక్-2015)
చెలియా చెలియా విడిపోకే కలలా (2 కంట్రీస్-2017)