ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీకి షాక్ !

ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీకి షాక్ !
  • కరీంనగర్ లో తొమ్మిది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌‌‌‌లోకి జంప్
  • గతంలోనే హస్తం పార్టీలో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు
  • అదేబాటలో బీజేపీ హుస్నాబాద్ ఇన్ చార్జి శ్రీరామ్‌‌‌‌ చక్రవర్తి

కరీంనగర్, వెలుగు: లోక్ సభ ఎన్నికల వేళ కరీంనగర్ బీఆర్ఎస్, బీజేపీలకు ఆయా పార్టీల నాయకులు షాకిచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్ కు చెందిన తొమ్మిది మం ది కార్పొరేటర్లతోపాటు మరో మాజీ కార్పొరేటర్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే, బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి బొమ్మా శ్రీరాం చక్రవర్తి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన సోదరి, బీజేపీ నేత జయశ్రీ కరీంనగర్ లో శుక్రవారం ప్రకటించారు. శ్రీరామ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 

బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు.. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఎన్నికలయ్యాక బీఆర్ఎస్ కు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, కిందిస్థాయి నాయకులు వందలాదిగా పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తర్వాత వీరు కాంగ్రెస్ లో చేరారు.

గతంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాశెట్టి‌‌‌‌ లావణ్య, ఆకుల పద్మ కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా మెండి శ్రీలత(44వ డివిజన్), నేతికుంట యాదయ్య(30వ డివిజన్​), చాడగొండ బుచ్చిరెడ్డి(35వ డివిజన్), గంట కళ్యాణి (22వ డివిజన్), సరిళ్ల ప్రసాద్(43వ డివిజన్),  పిట్టల శ్రీనివాస్(45వ డివిజన్),  ఆకుల నర్మద(11వ డివిజన్​), కోల భాగ్యలక్ష్మి(17వ డివిజన్​), కోటగిరి భూమాగౌడ్(40వ డివిజన్​)...సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

మాజీ కార్పొరేటర్ పత్యం పద్మ కూడా ఇదే సభలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 11 మంది కార్పొరేటర్లు చేరినట్లయింది. వీరితోపాటు మరో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కరీంనగర్ సిటీలో కార్పొరేటర్లు, వారి అనుచరులు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తరఫున ప్రచారం చేయడంపై అనాసక్తి కనబరుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కేటీఆర్ పర్యటనలోనూ ఇదే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్నా క్యాడర్ లో పెద్దగా మార్పు రాకపోవడం బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు తలనొప్పిగా మారింది.  సరిగ్గా ఎన్నికల ముందో.. ఎన్నికలైనంక కొద్ది రోజులకో కరీంనగర్ కు చెందిన బీఆర్ఎస్ పెద్ద లీడర్లు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ లోకి బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకోవడం బీజేపీ లోక్ సభ అభ్యర్థి బండి సంజయ్ కి షాకిచ్చినట్టయ్యింది. హుస్నాబాద్ టికెట్ కోసం ఈటల రాజేందర్ తన అనుచరుడు జే.సురేందర్ రెడ్డి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తే.. శ్రీరామ్ చక్రవర్తి కోసం సంజయ్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ సక్సెస్ అయ్యారు.

తీరా లోక్ సభ ఎన్నికల ముందు ఇలా హ్యాండ్ ఇవ్వడంతో సంజయ్ ఆవేదనకు గురైనట్లు తెలిసింది. కష్టకాలంలో బీజేపీ హుస్నాబాద్ టికెట్ ఇచ్చిందని, తాను వద్దంటున్న తన తమ్ముడు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యాడని ఆయన సోదరి, బీజేపీ నేత బొమ్మా జయశ్రీ కరీంనగర్ లో వెల్లడించారు. శ్రీరాం చక్రవర్తి చేరికతో హుస్నాబాద్ లో బీజేపీ ఓటు షేర్ పై తీవ్రంగా ప్రభావం పడే అవకాశముంది. ఆయన ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది.