ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధం : కలెక్టర్ గరిమా అగ్రవాల్

ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధం : కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు(యూనిఫామ్స్) సిద్ధవుతున్నాయని రాజన్నసిరిసిల్ల ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియను తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు శుక్రవారం జిల్లాకు రాగా ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ వారితో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. వస్త్ర పరిశ్రమకు కూడా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందితే తమ కుటుంబంతోపాటు సమాజ అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములను చేస్తోందన్నారు. 

అనంతరం సిరిసిల్లలోని వెంకట్రావునగర్‌‌‌‌‌‌‌‌లో మరమగ్గాల యూనిట్, గీతానగర్‌‌‌‌‌‌‌‌లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంను పరిశీలించారు. మరమగ్గాలపై సిద్ధం అవుతున్న చీరలను ఆయా జిల్లాల మహిళా సంఘాల బాధ్యులతో కలిసి పరిశీలించారు. 

దారం నుంచి చీరల తయారయ్యే విధానాన్ని చూసి, దాని వివరాలను కార్మికులు, యజమానులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో  సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ స్వరూపారెడ్డి, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర్ రావు, డీఆర్డీవో శేషాద్రి, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, ఏడీ రాఘవరావు  పాల్గొన్నారు.

వందేమాతరం గీతాలాపన 

వందేమాతరం గేయం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న  సందర్భంగా కలెక్టరేట్‌‌‌‌లో ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, అడిషనల్‌‌‌‌ కలెక్టర్ నగేశ్‌‌‌‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరై, గీతాలాపన చేశారు.