హైడ్రాపై 700 కేసులు, నాపై వ్యక్తిగతంగా 31 కేసులు: కమిషనర్ రంగనాథ్

 హైడ్రాపై 700 కేసులు, నాపై వ్యక్తిగతంగా 31 కేసులు: కమిషనర్ రంగనాథ్

ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు, కుంటల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోందన్నారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో హైడ్రాపై 700 కేసులు నమోదు కాగా.. తను వ్యక్తిగతంగా 31 కంటెంప్ట్ కేసులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.  2025 నవంబర్ 8 న మీడియాతో మాట్లాడిన ఆయన.. హైడ్రాకు అండగా నిలిచిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 

హైదరాబాద్ సిటీ భవిష్యత్తే లక్ష్యంగా హైడ్రా పని చేస్తోందని కమిషనర్ స్పష్టం చేశారు. నగర ప్రజల మద్దతు హైడ్రాకు స్ఫూర్తినిస్తుందన్నారు.   చట్టాల స్ఫూర్తితో ప్రజల ఆస్తులు, ప్రకృతిని కాపాడుతున్నామన్నారు. పేదల పేరుతో బడాబాబులు చేసిన కబ్జాలను  హైడ్రా వెలికితీస్తుందన్నారు. 

ఇప్పటి వరకు రూ.55 వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కాపాడిన తెలిపారు. మొత్తం 181 డ్రైవ్స్‌లో 954 కబ్జాలు తొలగించామని, వెయ్యి 45 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  వర్షాకాలంలో  హైడ్రా టీమ్ 96 వేల 972 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. క్యాచ్‌పిట్స్ క్లీనింగ్ 56 వేల330 – నాళాల క్లీనింగ్ 6 వేల721 పూర్తయినట్లు తెలిపారు.

వర్షాలు ముందుగానే అంచనా వేసి వరద నియంత్రణ సాధించినట్లు తెలిపారు కమిషనర్ రంగనాథ్. అమీర్‌పేట మైత్రీవనం ప్రాంతంలో వరద ముప్పుపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్యాట్నీ నాలా దగ్గర ఆక్రమణలు తొలగించి కాలనీలకు ఉపశమనం కల్పించినట్లు చెప్పారు. 

రూ.58 కోట్లతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో మరిన్ని చెరువుల అభివృద్ధి లక్ష్యంగా హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ప్రభుత్వం దిశానిర్దేశాల మేరకు ప్రకృతి పరిరక్షణే హైడ్రా ప్రధాన ధ్యేయం అని అన్నారు.