ప్రశ్నించడం కోసమే అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ప్రశ్నించడం కోసమే అరెస్ట్ చేయొద్దు.. పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
  • అరెస్టు ఒక విచక్షణ మాత్రమే.. తప్పనిసరి కాదని వెల్లడి
  • దర్యాప్తునకు కచ్చితంగా అవసరం ఉన్నప్పుడే అరెస్ట్​ చేయాలని సూచన

న్యూఢిల్లీ: అరెస్ట్ విషయలో పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం విచారణలో భాగంగా ప్రశ్నలు అడగడానికే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. పోలీసులకు ఉన్న అరెస్ట్ చేసే అధికారం అనేది దర్యాప్తు కోసం ఉపయోగించుకోవాల్సిన ఒక ‘విచక్షణ’ మాత్రమే తప్ప, అది తప్పనిసరి  కాదని కోర్టు పేర్కొంది. కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌) 2023 ప్రకారం, అరెస్ట్ అనేది పోలీసుల సౌలభ్యం కోసం కాకుండా, దర్యాప్తునకు ఖచ్చితమైన అవసరం ఉన్నప్పుడే చేయాలని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌‌, జస్టిస్ ఎన్.కె. సింగ్​లతో కూడిన బెంచ్​ పేర్కొంది. 

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుపై దాఖలైన అప్పీల్‌‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది.  ‘‘7 ఏండ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాల విషయంలో, అరెస్ట్ చేయకుండా దర్యాప్తు సాధ్యం కాదు అని పోలీసులు భావిస్తేనే ఆ చర్య తీసుకోవాలి. లేదంటే సెక్షన్ 35(3) ప్రకారం ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి” అని పేర్కొన్నది.

పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించాలి

‘‘పోలీస్ అధికారి కేవలం ప్రశ్నలు అడగడానికి ఒకరిని అరెస్ట్ చేయలేరు. నిందితుడు సహకరిస్తున్నప్పుడు, దర్యాప్తునకు ఆటంకం కలగనప్పుడు అరెస్ట్ చేయనక్కర్లేదు. అరెస్ట్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాబట్టి, పోలీసులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి” అని సూచించింది.