- దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
మహదేవపూర్, వెలుగు : సరస్వతి అంత్య పుష్కరాల పనులకు ప్రపోజల్స్ రెడీ చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. శుక్రవారం కాళేశ్వరంలోని దేవాలయం, సరస్వతీఘాట్, కాళేశ్వరం వంతెన, ముక్తివనాన్ని పరిశీలించారు. అనంతరం ఆలయ ఈవో, పీఆర్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, దేవాదాయ శాఖల ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహణకు ప్రభుత్వం రూ. 30 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు.
పుష్కరాలకు ఇంకా మూడు నెలలు మాత్రమే ఉన్నందున ప్రాధాన్యత ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. సరస్వతి అంత్య పుష్కరాలకు సుమారు 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు.
కుదురుపల్లి – బీరసాగర్ రోడ్డు నిర్మాణానికి, సిరొంచం నుంచి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి, వాహన పార్కింగ్ కోసం ప్రపోజల్స్ రెడీ చేయాలని సూచించారు. టెంట్ సిటీ, పార్కింగ్, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్ల వద్ద జనరేటర్లు, స్వామి వారిని దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్లను నియమించాలని సూచించారు. సమావేశంలో కలెక్టల్ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఈవో మహేశ్ పాల్గొన్నారు.
