హెల్త్‌‌‌‌లో నర్సుల పోస్టులే ఎక్కువ

హెల్త్‌‌‌‌లో నర్సుల పోస్టులే ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల్లో సగానికిపైగా స్టాఫ్‌‌‌‌ నర్స్‌‌‌‌ పోస్టులే ఉన్నాయి. టీచింగ్ హాస్పిటళ్లలో 4,400, వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటళ్లలో 700, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలోని దవాఖాన్లలో 1,500 స్టాఫ్‌‌‌‌ నర్స్‌‌‌‌ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 12,755 ఉద్యోగ ఖాళీల్లో.. 6,600 పోస్టులు నర్సులవే. డాక్టర్ల ఖాళీలు 3,600 ఉండగా.. ఇందులో టీచింగ్‌‌‌‌ హాస్పిటళ్లలో 1,600 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటళ్లలో 1,200 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్‌‌‌‌) పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో 800 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌‌‌‌ తదితర పారామెడికల్, అడ్మినిస్ర్టేటివ్‌‌‌‌, ఇతర పోస్టులన్ని కలిపి 2,500 వరకూ ఉన్నాయి. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని అన్ని రకాల కేడర్లలోనూ ఖాళీల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ, వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయట్లేదని హెల్త్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. తొలి దశలో 5 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని వివరించారు. ఇందులో  అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు కలిపి 1,500, స్టాఫ్ నర్స్ పోస్టులు  2,500, ఇంకో ఐదొందల వరకూ పారామెడికల్ పోస్టులు ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారమంతా చర్చల దశలో ఉన్నదని, నోటిఫికేషన్ రావడానికి కనీసం నెల రోజులు పడుతుందని అధికారులు చెప్తున్నారు. డాక్టర్లు, స్టాఫ్‌‌‌‌ నర్స్‌‌‌‌, పారామెడికల్ పోస్టుల రిక్రూట్‌‌‌‌మెంట్ బాధ్యతను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీ)కు అప్పగించాలని నిర్ణయించారు. దవాఖాన్లలో ఏర్పడే ఖాళీలను స్పీడ్‌‌‌‌గా రిక్రూట్‌‌‌‌ చేయాలన్న ఉద్దేశంతో మూడేండ్ల కిందటే ఈ బోర్డును ఏర్పాటు చేశారు. 

నో ఎగ్జామ్‌‌‌‌!

ప్రభుత్వ దవాఖాన్లలో చాలా మంది నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ ఏండ్ల నుంచి కాంట్రాక్ట్‌‌‌‌ బేసిస్‌‌‌‌పై వర్క్ చేస్తున్నారు. వీరికి ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల మంత్రి హరీశ్‌‌‌‌రావు కూడా పలు సభల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అకడమిక్ క్వాలిఫికేషన్‌‌‌‌కు సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు, కాంట్రాక్ట్ సర్వీస్‌‌‌‌కు సంవత్సరానికి 2 మార్కుల చొప్పున గరిష్టంగా 20 మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్టు తెలిసింది. గతంలో జరిగిన నర్సింగ్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లోనూ ఇదే పద్ధతిని పాటించారు.  ఈసారి అన్ని కేడర్లకు ఈ నిబంధనను వర్తింపజేయనున్నారు. ప్రస్తుతం ఇతర డిపార్ట్‌‌‌‌మెంట్లలో ఉద్యోగాలకు ఉన్నట్టుగానే, హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఉద్యోగాల భర్తీకి కూడా రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రాత పరీక్షను ఎత్తివేసి, సంబంధిత డిగ్రీలో వచ్చిన మార్కులనే ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగాల భర్తీ చేయాలని హెల్త్ ఆఫీసర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అకడమిక్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ మార్కులకు, అకడమిక్ క్వాలిఫికేషన్​ వెయిటేజీ, సర్వీస్ వెయిటేజీ కలిపి మెరిట్ నిర్ణయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం ప్రాథమిక దశలోనే ఉందని, ఎగ్జామ్‌‌‌‌ ఎత్తివేయడం వల్ల వచ్చే లీగల్ సమస్యలపై చర్చిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లీగల్ ఒపీనియన్ తర్వాతే ఎగ్జామ్ ఎత్తివేతపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు