ప్రజల్లో చిచ్చుపెడుతున్న బీజేపీకి ఓటమి తప్పదు : సీతక్క

ప్రజల్లో చిచ్చుపెడుతున్న బీజేపీకి ఓటమి తప్పదు : సీతక్క

నిర్మల్, వెలుగు: ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మత తత్వ విధానాలు అమలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్​అయ్యారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి హోటల్​లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అధ్యక్షతన శుక్రవారం నిర్మల్ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. అంతకుముందు నిర్మల్, సారంగాపూర్, ఖానాపూర్ మండలాల్లో ఆదిలాబాద్​ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు.

రెడ్డి ఫంక్షన్ హాల్​లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్​లో  చేరగా వారందరికీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న మోదీకి ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. ఆదివాసీ ముద్దుబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని, మహిళా అభ్యర్థిని పార్లమెంట్​కు పంపిస్తే ఉమ్మడి జిల్లాలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, టీపీసీసీ కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, ఏఐసీసీ కార్యదర్శి నరేశ్ జాదవ్, జడ్పీటీసీలు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, జాదవ్ సోనియా సంతోష్, ఎంపీపీలు రమేశ్, అమృత జైసింగ్, అడే సవిత, రామేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రవోతూ రాజేందర్, మార్కెట్ కమిటీ  మాజీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాహుల్​గాంధీ సభ ఏర్పాట్ల పరిశీలన 

నిర్మల్ లో ఈ నెల 5 న జరిగే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను సీతక్క పరిశీలించారు. ఆమె వెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు,‌ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, స్థానిక నాయకులు ఉన్నారు. వాహనాల పార్కింగ్, సభా వేదిక ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సభకు ఏఐసీసీ అగ్ర నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారని ఆమె తెలిపారు.