కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసీపేట-1 సింగరేణి బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికులు తాగేందుకు మంచినీళ్లవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. శుక్రవారం మొదటి షిప్టు విధుల కాలంలో గని కార్మికులందరు మేనేజర్ రూమ్ ఎదుట ధర్నాకు దిగారు. వీరికి సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, గని పిట్అసిస్టెంట్సెక్రటరీ వడ్లమల్ల రాజేందర్, లీడర్లు మద్దతుగా నిలిచారు. 20 రోజులుగా గనిపై ఉన్న డ్రింకింగ్ వాటర్ ఆర్వో ప్లాంట్ పని చేయడం లేదన్నారు.
ప్లాంట్‌కు రిపేర్లు చేయాలని ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని నిరసన వ్యక్తంచేశారు. ఆర్వో ప్లాంట్‌కు రిపేర్లు చేసి తాగునీటి సప్లై చేస్తామని గని మేనేజర్ సతీశ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన కార్మికులు,ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ లీడర్లు రంజిత్ కుమార్, ఆడెపు రవీందర్, కోల కమలాకర్ పాల్గొన్నారు.
