నాచు కర్టెన్లు కాలుష్యానికి అడ్డుకట్టలు

నాచు కర్టెన్లు కాలుష్యానికి అడ్డుకట్టలు

సిటీల్లో కాలుష్యం ఏ రేంజ్​లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. దీంతో ముక్కుమూసుకుని బయటికెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతో కొంత పొగను మనం పీల్చేస్తూనే ఉన్నాం. మరి, ఆ కాలుష్యపు పొగను మనం పీల్చకుండా కర్టెన్లు పీల్చేసి ఆక్సిజన్​ను తయారు చేసిస్తే ఎట్ల ఉంటదన్న ఆలోచన వచ్చింది లండన్​కు చెందిన కొందరు సైంటిస్టులు, ఆర్కిటెక్ట్​లకు. కాలుష్యం లేకుండా సిటీలను పచ్చగా మార్చేయాలన్న ఆ ఆలోచనతోనే ఆల్గే బయో కర్టెన్లను తయారు చేశారు. ఆల్గే అంటే, అందరికీ తెలసిందే. నీళ్లలో ఉండే పాకూరు. అదేనండి నాచు. సింపుల్​గా చెప్పాలంటే నాచు కర్టెన్లను తయారు చేశారు. ఏ బిల్డింగులకైనా, ఇళ్లకైనా పెట్టేసుకోవచ్చు.

ఆల్గేనే ఎందుకంటే…

మనకంటే కార్బన్​ డయాక్సైడ్​​ డేంజర్​. కానీ, నాచుకు అదే ఆహారం మరి. దానిని పీల్చేసుకుని నాచు ఎదుగుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్​ను విడుదల చేస్తుంది. అందుకే సైంటిస్టులు నాచును ఎంచుకున్నారు. సహజసిద్ధంగానే దానిని నీటి వనరులు లేదా ఇళ్ల నుంచి సేకరించి ల్యాబ్​లో ట్రీట్​ చేస్తారు. దాని పనితీరు మరింత పెరిగేలా ఓ రకం జెల్​ను దానికి కలుపుతారు. ఇప్పుడు ఆ నాచు జెల్​ను ప్లాస్టిక్​ కర్టెన్లలోకి ఎక్కిస్తారు. అలా నాచును నింపిన కర్టెన్లను బిల్డింగ్​లకు వేలాడదీస్తారు. అప్పుడు ఆ కర్టెన్లపై సూర్యుడి కాంతి పడడం వల్ల ఆ కర్టెన్లలోని నాచు కిరణ జన్య సంయోగ క్రియ (ఫొటోసింథసిస్​)ను జరుపుతుంది. కర్టెన్ల కింది భాగం నుంచి కాలుష్య కారక పొగను నాచు పీలుస్తుంది. ఫొటోసింథసిస్​ ద్వారా కార్బన్​ డయాక్సైడ్​ను తీసుకుని, కర్టెన్ల పై భాగం నుంచి ఆక్సిజన్​ను గాల్లోకి వదిలేస్తుంది. నగరాల్లో కాలుష్య కారకాలను తగ్గించేందుకు ఇది చాలా మంచి ప్రత్యామ్నాయమని ఈ కర్టెయిన్లను తయారు చేసిన ఎకోలాజిక్​స్టూడియో సైంటిస్ట్​ డాక్టర్​ మార్కో పొలెట్టో చెప్పారు. ఈ కర్టెన్లు ఓ పెద్ద చెట్టుతో సమానమన్నారు. 2050 నాటికి కాలుష్యం లేని నగరాలుగా తీర్చిదిద్దేందుకు బ్రిటన్​ పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే ఇలాంటి మార్గాల్లో వెళితే బాగుంటుందని సూచించారు. ప్రస్తుతం వీటిని డబ్లిన్​లోని కస్టమ్స్​ అండ్​ రెవెన్యూ హౌస్​ బిల్డింగ్​కు, హెల్సింకీలోని హౌస్​ ఆఫ్​ నోబిలిటికి ఏర్పాటు చేశారు.

లోపాలూ ఉన్నాయి

చెట్లతో పోలిస్తే ఈ బయో కర్టెన్లలో కొన్ని లోపాలూ ఉన్నాయి. కర్టెన్లు కేవలం 70 శాతం మాత్రమే నేలలో కలిసిపోతాయి. మిగతాదంతా ప్లాస్టికే. అంతేకాదు, దీంట్లో వాడుతున్న నాచును తరచూ పెంచాల్సి  ఉంటుంది. దానికి పటిష్టమైన నిర్వహణ అవసరం. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఈ కర్టెన్లకు స్థలం అవసరం కొంచెమే ఉన్నా, వాటికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు మాటెలా ఉన్నా ప్రకృతితో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేయడం కోసమే ఈ ప్రయత్నమంటున్నారు ఎకోలాజిక్​స్టూడియోకే చెందిన మరో సైంటిస్ట్​ క్లాడియా పాస్క్వెరో. మనిషి కార్బన్​ డయాక్సైడ్​ పీల్చుకుంటే ప్రమాదమని, అదే కార్బన్​ డయాక్సైడ్​ నాచుకు ఆహారమని అన్నారు. కాబట్టి కాలుష్యం ఉండే సిటీల్లో ఈ నాచును వాడితే, వాటికి ఆహారంతో పాటు మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్​ దొరుకుతుందని చెబుతున్నారు.