అప్పు ఇస్తామన్న వాళ్లు కూడా వెనక్కి వెళ్లారు: ఎంపీ గల్లా

అప్పు ఇస్తామన్న వాళ్లు కూడా వెనక్కి వెళ్లారు: ఎంపీ గల్లా

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక రావలసిన నిధులన్ని వెనక్కి పోయాయని,  రాష్ట్రానికి అప్పు ఇస్తామన్న వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయారన్నారు ఎంపి గల్లా జయదేవ్.  బుధవారం టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుందని గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ధారిస్తే ..  ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజధాని నిర్మాణం విషయంలో అసలు అమరావతి పేరు పలకడం లేదని అన్నారు.  జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర భవిష్యత్తు గురించి అమరావతి అవసరమని తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన తర్వాత పది  ఏళ్లు హైదరాబాదులోనే ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందని ఆనాడు చంద్రబాబు అమరావతికి తీసుకొచ్చారని జయదేవ్ అన్నారు. నదీపరీవాహక ప్రాంతంలో రాజధాని కడితే చాలా సుందరమైన సిటీ అవుతుందని చంద్రబాబు తనకున్న విజన్ తో అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను నమ్మి, రైతులు 35వేల ఎకరాల భూమి ఇచ్చారని, ఇప్పుడు వారంతా ఏమవ్వాలని గల్లా ప్రశ్నించారు.

ఆయనది నోరా? తాటిమట్లా?: అచ్చెంనాయడు

అమరావతిలో ఒక్క ఇటుక కూడా వేయలేదని వైసీపీ నేతలు సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అచ్చెంనాయుడు అన్నారు. అసలు పనులే జరగలేదని బొత్స సత్యనారాయణ  అంటున్నారని, అలా అనడానికి సత్తిబాబుది  నోరా తాటిమట్టా అని ప్రశ్నించారు.  అమరావతిలో రాజధాని నిర్మాణాలు జరిగాయనడానికి ఎంఎల్ఏ క్వార్టర్స్ ఒక నిదర్శనమని అన్నారు.

MP Galla jayadev comments at Tour of the capital region