కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థుల మధ్య ‘ఎలక్షన్ ఫైట్ ’

కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థుల మధ్య ‘ఎలక్షన్ ఫైట్ ’

మల్లికార్జున్ ఖర్గే లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో మార్పులు తీసుకురాలేరని, ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తారని పార్టీ అధ్యక్ష పదవికి బరిలోకి దిగిన ఎంపీ శశిథరూర్ అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే పార్టీ నాయకులు, కార్యకర్తల అంచనాలకు అనుగుణంగా మార్పులు తీసుకువస్తానని చెప్పారు. “మేము శత్రువులం కాదు. ఇది యుద్ధం కాదు. ఇది మా పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. కాంగ్రెస్‌లో ముగ్గురు అగ్రనేతల్లో ఖర్గే ఉన్నారు. ఖర్గే లాంటి నాయకులు కాంగ్రెస్ లో మార్పులు తీసుకురాలేరని, ఉన్న వ్యవస్థనే కొనసాగిస్తారు. పార్టీ కార్యకర్తల అంచనాల మేరకు నేను మార్పు తీసుకొస్తాను' అని శశి థరూర్ నాగ్‌పూర్‌లో అన్నారు.

ఇక అంతకుముందు తాను ఎవరినీ ఎదిరించేందుకే ఎన్నికల్లో నిలబడలేదని, పార్టీని బలోపేతం చేయడం కోసమేనని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు చాలా మంది సీనియర్లు మద్దతు ప్రకటించారని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి కచ్చితంగా పోటీ చేయాలని వారంతా తనను కోరారని, వారి ప్రోత్సాహం వల్లే  తాను అధ్యక్ష బరిలో నిలబడినట్లు పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ లో జీ–23 నేతలెవరూ లేరని, తామంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం తమ లక్ష్యం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడటమేనని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉన్నందున.. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ రాజ్యసభా పక్షనేత పదవికి రాజీనామా చేశానని మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా ఎవరో ఒకరూ అధ్యక్ష పదవి చేపట్టేలా ఏకాభిప్రాయానికి వద్దామని శశి థరూర్ తో మాట్లాడినట్లు ఖర్గే తెలిపారు. 

జార్ఖండ్‌ మాజీ మంత్రి కెఎన్‌ త్రిపాఠి నామినేషన్‌ శనివారం తిరస్కరణకు గురైన నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌ పోటీలో నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. అవసరమైతే అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించి, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.