సీక్రెట్ రూమ్‌లో 17 మంది బార్‌‌ డ్యాన్సర్లు

సీక్రెట్ రూమ్‌లో 17 మంది బార్‌‌ డ్యాన్సర్లు

ముంబై : ముంబైలోని అంధేరీ ప్రాంతం. అక్కడి ఓ బార్ లో మహిళా డ్యాన్సర్లతో నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాని ఆధారంగా బార్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కానీ బార్ గర్ల్స్ ఎవరూ కనిపించలేదు. అక్కడి నుంచి వెనుదిరిగిన పోలీసుల్లో ఒకరికి వచ్చిన అనుమానం 17 మంది డ్యాన్సర్లను బార్ యాజమాన్యం చెర నుంచి విడిపించింది. 

అంధేరీలోని దీపా బార్ ఎక్స్సైజ్ నియమ నిబంధనలు పాటించడం లేదని ఓ ఎన్జీఓ ముంబై పోలీసులకు కంప్లైంట్ చేసింది. అక్కడ బార్ గర్ల్స్ తో అసభ్య నృత్యాలు చేయిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో బార్ లో తనిఖీలు ప్రారంభించారు. కిచెన్, స్టోర్ రూమ్, బాత్రూమ్ ఇలా దేన్నీ వదలకుండా ప్రతి చోటా వెతికారు. కానీ డ్యాన్సర్ల జాడ మాత్రం కనిపించలేదు. బార్ మేనేజర్, వెయిటర్లను ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. 
స్టేషన్ కు తిరిగి వెళ్లిన అనంతరం ఓ పోలీసుకు వచ్చిన అనుమానంతో ఖాకీలు ఆదివారం తెల్లవారుజామున మరోసారి బార్ కు వెళ్లారు. అక్కడి మేకప్ రూంలో ఉన్న ఓ పెద్ద అద్దంపై అనుమానం రావడంతో దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో సుత్తితో పగలగొట్టారు. ఆ అద్దం వెనుక వారికి ఓ ఎలక్ట్రానిక్ డోర్ కనిపించింది. అది ఓపెన్ చేసి చూడగా.. ఏసీ, బెడ్స్ సహా సకల సదుపాయాలు కలిగిన సీక్రెట్ రూంలో 17 మంది బార్ గర్ల్స్ కనిపించారు. డ్యాన్సర్లతో పాటు చట్ట విరుద్దంగా వారితో నృత్యాలు చేయిస్తున్న బార్ మేనేజర్, క్యాషియర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.