
- కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. మంత్రి సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం కేసులో నాంపల్లిలోని స్పెషల్ కోర్టు విచారణ ప్రారంభించింది. సురేఖపై శనివారం పరువునష్టం, క్రిమినల్ కేసును రిజిస్టర్ చేసింది. కేస్ క్యాలండర్ (సీసీ) నంబర్ కేటాయించి, ఆగస్టు 21లోగా సమన్లు జారీ చేయాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై కొండా సురేఖ పలు ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ నిరుడు అక్టోబర్‌లో నాంపల్లిలోని స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపి న కోర్టు.. కేటీఆర్‌తో పాటు సాక్షులుగా బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్ స్టేట్‌మెంట్లను రికార్డు చేసిం ది. వీటి ఆధారంగా కొండా సురేఖపై కేసు నమోదుకు ఆదేశించింది.
న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది: సురేఖ
ఈ కేసు విషయంలో కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని మంత్రి సురేఖ తెలిపారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది జరిగి రెండు రోజులైందని తెలిపారు. కానీ కొంతమంది జర్నలిస్టులు.. ‘‘కొండా సురేఖ కేసులో సంచలనం.. బిగ్ బ్రేకింగ్’’ అంటూ వార్తలు ఇవ్వడంలో ఉత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని చెప్పారు.