ట్రాఫిక్ రూల్స్ క్రాస్ చేసిన 371మందికి జైలు శిక్ష

ట్రాఫిక్ రూల్స్ క్రాస్ చేసిన 371మందికి జైలు శిక్ష

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 371 మందికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నగర ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసిన 4,360 మందిలో 371 మంది ట్రాఫిక్‌ అక్రమార్కులకు జైలుశిక్షను విధిస్తూ నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. 3,989 మంది నేరస్తులకు కలిపి రూ.94,33,300 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి నెలలో 2,965 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా.. 58 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను పోలీసులు సస్పెండ్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు సుమారు 495 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు..  మొత్తం రూ.5,50,700 జరిమానాలు విధించారు.

111 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా ఒక్కొక్కరికి రూ.1200 జరిమానా విధించారు. నేరం రుజువైతే పాస్‌పోర్ట్‌లు పొందడంలో, వీసా క్లియరెన్స్‌లు కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ట్రాఫిక్ పోలీసులు చట్టాలను ఉల్లంఘించవద్దని ఎప్పటినుంచో ప్రజలను కోరుతున్నా.. ఇంకా ఈ తరహా కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే కేసు నమోదైన వారందరికీ గోషామహల్‌, బేగంపేటలోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీటీఐ)లో కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.