యువతి బట్టలు చింపేసిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

యువతి బట్టలు చింపేసిన ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
  •    వారంలోగా రిపోర్టు ఇవ్వాలని డీజీపీకి ఆదేశం
  •     హైదరాబాద్​లో శాంతిభద్రతలపై ఆందోళన  

న్యూఢిల్లీ/జవహర్ నగర్, వెలుగు: ఓ తాగుబోతు.. యువతి బట్టలు చింపేసిన ఘటనపై నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) సీరియస్ అయింది. హైదరాబాద్​లో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ శివారు జవహర్ నగర్​లోని బాలాజీనగర్ వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో యువతితో అసభ్యంగా ప్రవర్తించి, ఆమె బట్టలు చింపేశాడు. దీనిపై స్పందించిన ఎన్ సీడబ్ల్యూ.. నడి రోడ్డులో యువతిపై దాడి చేసి, బట్టలు చింపేయడం అమానవీయం. బాధిత మహిళకు వైద్య సహాయం అందించాలి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. అలాగే వారంలోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంది. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్​ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్, డీజీపీ, సిటీ పోలీసులకు ట్యాగ్ చేసింది. ఈ కేసులో నిందితుడైన పెద్ద మారయ్య(30)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మారయ్యకు సహకరించిన అతని తల్లి నాగమ్మను మంగళవారం రిమాండ్ కు తరలించారు.  

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్యే సీతక్క 

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బాధితురాలిని మంగళవారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఇటీవల అసెంబ్లీలో శాంతిభద్రతలు, మహిళల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. నడి రోడ్డుపై యువతిని అడ్డుకుని, బట్టలు చింపేయ్యడం దారుణం. ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన తల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని సీతక్క డిమాండ్ చేశారు. ఇంతటి ఘోరం జరిగినా స్థానిక మంత్రి మల్లారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బాధితురాలిని పరామర్శించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, వాటిని తొలగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బాధిత మహిళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని సీతక్క భరోసా ఇచ్చారు.