మునుగుతున్న పంపులు..తెగుతున్న కాల్వలు

మునుగుతున్న పంపులు..తెగుతున్న కాల్వలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర సర్కార్ గొప్పలు చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కన్నెపల్లి పంపుహౌస్‌‌ మొదలు ప్రాజెక్టు 21వ ప్యాకేజీలోని సారంగపూర్‌‌ పంపుహౌస్‌‌ వరకు వరదల్లో మునిగిపోయాయి. కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజీకి నీటిని తరలించే గ్రావిటీ కాల్వ నుంచి మొదలుపెడితే మల్లన్నసాగర్‌‌, బస్వాపూర్‌‌ కాల్వల వరకు తెగిపోవడమో, లైనింగ్‌‌ కొట్టుకుపోవడమో జరిగాయి. పైపులైన్లు పైకి తేలడం, పంపుహౌస్‌‌లను వరద చుట్టుముట్టడం పరిపాటిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మైలేజ్‌‌ పెంచడమే లక్ష్యంగా డ్యాం ప్రొటోకాల్‌‌ ఫాలో కాకుండా మిడ్‌‌మానేరు నింపడంతో దానికి బుంగపడింది.పనులు వేగంగా పూర్తి చేయాలని తరచూ టార్గెట్లు పెట్టడం కూడా సమస్యలకు కారణంగా తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభించిన నెలన్నరకే నిర్మాణంలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. 2019 సెప్టెంబర్‌‌‌‌‌‌ 3న కన్నెపల్లి ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ దెబ్బతిని పంపుహౌస్‌‌‌‌ నీట మునిగింది. 200 మీటర్ల పొడవు, ఏడు మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిచి మోటార్ల విడిభాగాలు మునిగిపోయాయి. అదే సమయంలో మేడిగడ్డ, అన్నారం గేట్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. పంపుహౌసుల్లో మోటార్లు నడవకుండా తిప్పలు పెట్టాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే లింక్‌‌‌‌–2లోని లక్ష్మీపూర్‌‌‌‌ పంపుహౌస్‌‌‌‌ గోడలు లీకై నీళ్లు లోపలికి వచ్చాయి. ప్రాజెక్టు ప్రారంభించిన ఏడాదే కాళేశ్వరంను ఆకాశానికి ఎత్తాలనే ప్రయత్నం మిడ్‌‌‌‌మానేరు రిజర్వాయర్ ను దెబ్బతీసింది. డ్యాం ప్రొటోకాల్‌‌‌‌ పాటించకుండా నిండా నీళ్లు నింపడంతో కట్టకు బుంగపడి రిజర్వాయర్‌‌‌‌ మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చింది.

సేఫ్టీ లేని పంప్ హౌస్​లు

ఈ ఏడాది ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు కొట్టొచ్చినట్టు బయట పడుతున్నాయి. సుందిళ్ల బ్యారేజీ కట్ట భారీ వర్షానికి దెబ్బతింది. జులై 28న అన్నారం పంపుహౌస్‌‌‌‌ పైపులు వరద ఉధృతికి భూమి పైకి తేలాయి. వాటిని మట్టితో కప్పి మమ అనిపించారు. జులై 23న కురిసిన భారీ వర్షానికి అన్నారం పంపుహౌస్‌‌‌‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. గోదావరిలో వరద ఉధృతంగా ఉండటం, పంపుహౌస్‌‌‌‌ పక్కనే ఉన్న జల్లారం వాగులో వరద వెనక్కి తన్నడంతో పంపుహౌస్‌‌‌‌ మునిగిపోయింది. దీనికి సేఫ్టీవాల్‌‌‌‌ నిర్మించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. వరద ఇంకా కొనసాగి ఉంటే మోటార్లు మునిగి భారీ నష్టం వాటిల్లేది. సెప్టెంబర్‌‌‌‌ రెండో వారంలో ఎస్సారెస్పీకి వరద పోటెత్తడంతో 21వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న సారంగపూర్‌‌‌‌ పంపుహౌస్‌‌‌‌ నీట మునిగింది. ఎస్సారెస్పీకి వరద పోటెత్తితే ఈ పంపుహౌస్‌‌‌‌కు ప్రమాదం తప్పదని రిటైర్డ్‌‌‌‌ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు సూచిస్తున్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలని, అవసరమైన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

కాల్వల పనుల్లో నో రూల్స్

2020 ఆగస్టు 23న కన్నెపల్లి నుంచి అన్నారం పంపుహౌస్‌‌‌‌కు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్‌‌‌‌ లైనింగ్‌‌‌‌ కొట్టుకుపోయింది. 8.5 కిలోమీటర్ల పొడవు, 7 మీటర్ల వెడల్పుతో లైనింగ్‌‌‌‌ కొట్టుకుపోయింది. లూజ్‌‌‌‌ సాయిల్‌‌‌‌ ఉన్న ప్రాంతాల్లోనూ రూల్స్ ప్రకారం పనులు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అదే ఏడాది జూన్‌‌‌‌ 6న కొండపోచమ్మ సాగర్‌‌‌‌ పంపుహౌస్‌‌‌‌ వరదకు దెబ్బతింది. పంపుహౌస్‌‌‌‌లోకి నీళ్లు చేరాయి. జూన్‌‌‌‌ 13న మల్లన్నసాగర్‌‌‌‌ కాల్వకు కొండపాక మండలం ఎర్రవెల్లి దగ్గర గండిపడి దిగువ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జూన్‌‌‌‌ 30న కొండపోచమ్మ సాగర్‌‌‌‌ నుంచి నీటిని తరలించే కాల్వకు గండిపడి శివారు వెంకటాపూర్‌‌‌‌ ఊరు నీట మునిగిపోయింది. జులై 7న రంగనాయక సాగర్‌‌‌‌ పంపుహౌస్‌‌‌‌ డెలివరీ సిస్టర్న్ వద్ద రివిట్‌‌‌‌మెంట్‌‌‌‌ దెబ్బతింది. ఆగస్టు 30న కొండపోచమ్మ సాగర్‌‌‌‌లో నిర్మించిన వాకోవర్‌‌‌‌ బ్రిడ్జి కూలిపోయింది. రూల్స్ ​ప్రకారం కాలువల పనులు చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది.

మచ్చుకు కొన్ని..

ఈ ఏడాది జులై 23న వర్షాలకు అన్నారం పంపుహౌస్‌లోకి భారీగా నీరు చేరింది.జులై 28న వర్షాలకు అన్నారం పంపుహౌస్‌ పైపులు పైకి తేలాయి.  సెప్టెంబర్‌ రెండో వారంలో సారంగపూర్‌ పంపుహౌస్‌ మునిగింది.2020 ఆగస్టు 23న అన్నారం పంపుహౌస్‌‌కు నీటిని తరలించే గ్రావిటీ కెనాల్‌‌ లైనింగ్‌‌ కొట్టుకుపోయింది.అదే ఏడాది జూన్‌‌ 6న కొండపోచమ్మ సాగర్‌‌ పంపుహౌస్‌‌ వరదకు దెబ్బతింది. జూన్‌‌ 13న మల్లన్నసాగర్‌‌ కాల్వకు ఎర్రవెల్లి దగ్గర గండిపడింది. జూన్‌‌ 30న కొండపోచమ్మ సాగర్‌‌ నుంచి నీటిని తరలించే కాల్వకు గండి.