ఎన్టీపీసీ నిర్వాసితులపై నిర్లక్ష్యం

ఎన్టీపీసీ నిర్వాసితులపై నిర్లక్ష్యం

గోదావరిఖని, వెలుగు : ఎన్టీపీసీ నిర్వాసితులు నివసిస్తున్న నర్రశాలపల్లి, మల్కాపురం తదితర కాలనీలపై ఎన్టీపీసీతోపాటు రామగుండం కార్పొరేషన్‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రహదారులు విస్తరించకపోవడం, ఉన్న రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో ఇరుకుగా ఉన్న దారులపై ప్రయాణిస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   

ఎనిమిదేళ్ల క్రితం రోడ్డు నిర్మాణం..

శ్రీనగర్‌‌ కాలనీ నుంచి సీఐఎస్‌‌ఎఫ్‌‌(టౌన్‌ ‌షిప్‌‌) బ్యారెక్స్‌‌, మల్కాపూర్‌‌, జంగాలపల్లి, నర్రశాలపల్లి, రామయ్యపల్లికి వెళ్లేందుకు వీలుగా 8 సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంట్‌‌ సీఎస్‌‌ఆర్‌‌ నిధులతో రోడ్డు నిర్మించంది. ప్రస్తుతం ఈ రహదారి పాడై ప్రయాణించేందుకు వీల్లేకుండా పోయింది. గతంలో రామగుండం కార్పొరేషన్‌‌లో రెండు డివిజన్ల నడుమ ఉన్న ఈ రహదారి ప్రస్తుతం పూర్తిగా 5వ డివిజన్‌‌ పరిధిలోకి వచ్చింది. వర్షాకాలం వచ్చిందంటే పెద్దపెద్ద గుంతలుగా మారే ఆ దారిగుండా వెళ్లేందుకు వివిధ కాలనీల ప్రజలు జంకుతున్నారు. సింధూర కాలేజీ నుంచి గ్యాస్‌‌ గోదాం వరకుగల రోడ్డుపై, అక్కడి నుంచి శాలపల్లి వరకుగల రోడ్డుపై కంకర పోసి తారు వేయలేదు. దీంతో ఆ రోడ్డుపై వెళ్లే వెహికల్స్‌‌ పంక్చర్​అవుతున్నాయి.

ఆందోళన చేసినా స్పందన కరువు..

శ్రీనగర్‌‌ కాలనీ నుంచి మల్కాపూర్‌‌ వరకు, గ్యాస్‌‌ గోదాం నుంచి శాలపల్లి వరకు రోడ్లు విస్తరించాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు గతంలో రాజీవ్‌‌ రహదారిపై రాస్తారోకో చేసినా ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంట్‌‌, రామగుండం కార్పొరేషన్‌‌ అధికారులు స్పందించడం లేదు. గతంలో ఈ రోడ్లను నిర్మించిన ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంటే రోడ్ల విస్తరణ కూడా చేపట్టాలని రామగుండం కార్పొరేషన్‌‌ అధికారులు తెలిపారు. ఇన్ఫర్మేషన్‌‌ యాక్టు కింద అడిగిన ఓ ప్రశ్నకు కార్పొరేషన్‌‌ అధికారులు ఈ విషయమై స్పష్టత ఇచ్చారు. కానీ ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంట్‌‌ మాత్రం స్పందించడం లేదు. 

బూడిద పైపులైన్‌‌తో లింక్‌‌ ...?

ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌‌ నుంచి విడుదలయ్యే బూడిదను శ్రీనగర్‌‌ కాలనీ, మల్కాపూర్‌‌ రోడ్డు మీదుగా సింగరేణి మేడిపల్లి ఓపెన్‌‌కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లోని క్వారీలో నింపడానికి వీలుగా పైపులైన్‌‌ వేయడానికి ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంట్‌‌ నిర్ణయించింది. ఇందుకోసం పైపులైన్‌‌ వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు స్థలాన్ని సేకరించేపనిలో నిమగ్నమయ్యారు. అయితే బూడిద పైపులైన్‌‌ వేయడానికి వీలుగా అవసరమైన స్థలాన్ని ఇవ్వడానికి స్థానికులు ముందుకు రావడం లేదు. స్థలం ఇచ్చేది లేదని ఆందోళన చేశారు. ఈ క్రమంలో బూడిద పైపులైన్‌‌కు భూములు ఇస్తేనే రోడ్డు నిర్మాణం, విస్తరణ చేసేందుకు ఎన్టీపీసీ మేనేజ్‌‌ మెంట్‌‌ సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాగా బూడిద పైపులైన్‌‌తో సంబంధం లేకుండా రోడ్లు విస్తరణ చేయాలని ప్రజలు పలుమార్లు ప్రజావాణిలో కలెక్టర్‌‌కు వినతిపత్రాలు అందజేశారు.

రోడ్లను విస్తరించాలి

శ్రీనగర్‌‌ కాలనీ‒మల్కాపూర్‌‌ రోడ్డును వెంటనే విస్తరించాలి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు అధ్వానంగా తయారై అవస్థలు పడుతున్నాం. రోడ్డు నిర్మాణానికి ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంట్‌‌ ఇబ్బందులు సృష్టించడం సరికాదు. ఈ విషయమై మున్సిపల్‌‌ అధికారులు చొరవ తీసుకోవాలి. 

- ఎండీ రహీం, మల్కాపూర్‌‌