ఓల్డ్ సాంగ్స్.. న్యూ రీమిక్స్

ఓల్డ్ సాంగ్స్.. న్యూ రీమిక్స్

పాత సినిమా పేర్లను కొత్త సినిమాలకి పెడుతున్నారు. పాత కథలను కొత్త మలుపులతో మళ్లీ తీస్తున్నారు. పాత పాటల్ని మళ్లీ కొత్తగా వినిపిస్తే ఎలా ఉంటుంది? దీనికి సమాధానమే.. రీమిక్స్. ట్యూన్ అదే. లిరిక్స్ అవే. కానీ కొత్తగా ఉంటుంది. అయితే.. ఈ ప్రయోగం సక్సెస్ అవుతోందా? అసలిలా చేయాల్సిన అవసరం ఉందా?

‘బంగారు కోడిపెట్ట.. వచ్చెనండీ’ అంటూ ఒకప్పుడు మెగాస్టార్ స్టెప్పులేస్తే అభిమానులు ఊగిపోయారు. అదే పాటకి ఆయన కొడుకు రామ్ చరణ్‌ డ్యాన్స్ ఇరగదీస్తే వహ్వా అన్నారు. ‘నేను పుట్టాను.. ఈ లోకం మెచ్చిం ది’ అంటూ ఏఎన్నార్ వేదాంతం చెబితే నిజమే కదా అన్నారు. అదే సిద్ధాంతాన్ని ఆయన కొడుకు, మనవడు కలిసి ఫాలో అయితే చప్పట్లు కొట్టారు. ఒకప్పటి పాపులర్ పాటను తెచ్చి తమ సినిమాకి యాడ్ చేస్తే ఆకట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే రీమిక్స్‌‌ పాటకి డిమాండ్ పెరిగింది. వివాదమూ రేపుతోంది.

రీ రీ రీమిక్స్
విన్న పాటనే మళ్లీ మళ్లీ వినాలనిపించిందంటే ఆ పాట ఎంతో నచ్చిందని. ఎలాగూ వింటూనే ఉంటారని తెలిసినా ఆ పాటకు కొత్త సొగసులద్దాల్సిన అవసరం ఏమిటనేది చాలామంది అడిగే ప్రశ్న. జవాబు సంగతి ఎలా ఉన్నా.. రీమిక్స్ అనేది ఇప్పుడు ట్రెండ్. అందుకే టాలీవుడ్‌‌లో రీమిక్స్‌ హంగామా నిరాటంకంగా కొనసాగుతోంది. ఆకాశంలో ఒక తార అంటూ ‘సింహాసనం’లో సూపర్‌‌‌‌ స్టార్ సెప్టేస్తే .. దాన్ని ‘సీమ టపాకాయ్‌ ’లాంటి అల్లరోడు వాడేసుకున్నాడు. దంచవే మేనత్త కూతురా అంటూ ‘మంగమ్మగారి మనవడు’ అల్లరి చేస్తే.. ‘రైడ్‌‌’లో నాని దాన్ని ఇమిటేట్ చేశాడు. నిలువవే వాలు కనులదానా అంటూ అనుష్కను ఏడిపించడమే ‘లక్ష్యం’గా గోపీచంద్ పెట్టుకుంటే .. గలగల పారుతున్న గోదారిలా అంటూ ‘పోకిరి’ పిల్లోడు ఎమోషనల్ అయ్యాడు. ఆకు చాటు పిందె
తడిసిందంటూ ఆర్తి ఆగర్వాల్‌‌ని ‘అల్లరి బుల్లోడు’, ఓలమ్మీ తిక్క రేగిందా అంటూ మమతా మోహన్‌‌దాస్‌‌ని ‘యమదొంగ’ ఓ ఆటాడుకున్నారు. మావిళ్ల తోటకాడ మాటేసి ‘వీరా’ గొడవ చేస్తే… మాయదారి సిన్నోడు మనసు లాగేశాడంటూ ‘దేవదాసు’ ప్రేయసి రచ్చ రచ్చ చేసింది. అమలాపాల్‌‌తో ‘నాయక్‌‌’ శుభలేఖ రాసుకుంటే.. నిన్ను రోడ్డు మీద చూసింది లగాయతు అంటూ ‘సవ్యసాచి’ పాటందు కున్నాడు. ఇవే కాదు.. ఎట్టాగ ఉన్నాది ఓలమ్మీ, ఆరేసుకోబోయి పారేసుకున్నాను , అరె ఓ సాంబా, భీమవరం బుల్లోడా, ఈ రేయి తీయనిదీ, కంటిచూపు చెబుతోంది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పల్లెకు పోదాం పారులు చూద్దాం , వాన వాన వెల్లువాయె.. ఒకటా రెండా, రీమిక్స్ పాటలు బోలెడు.

బీ టౌన్‌‌ బిల్డప్‌
రీమిక్స్ సాంగ్స్‌ విషయంలో బాలీవుడ్ చాలా స్పీడు మీదుంది. ఏ క్లాసిక్‌‌నీ వదలడం లేదు. ప్రతి హిట్ సాంగ్‌‌నీ పట్టుకొచ్చి మళ్లీ కొత్తగా చుట్టేస్తోంది. మెహబూబా మెహబూబా, లైలా మై లైలా, తూ చీజ్‌‌ బడీ హై మస్త్​ మస్త్​, హర్ కిసీకో నహీ మిల్‌‌తా , టమ్మా టమ్మా లోగే, హవా హవాయీ, ఏక్‌‌ దో తీన్ లాంటి మాస్ మసాలా స్పీడ్ సాంగ్స్‌నే కాదు.. దిల్‌‌ క్యా కరే జబ్‌ కిసీసే, అజీబ్‌ దాస్‌‌తా హై యే లాంటి మెలోడీస్‌‌ని కూడా వదలట్లేదు. అయితే వీటికి బిల్డప్‌ ఎక్కువవుతోందని, పాటని అందంగా ప్రెజెంట్ చేయడం కంటే ఆర్కెస్ట్రయిజేషన్‌‌ని మార్చడమే లక్ష్యంగా ఈ పాటలు పెడుతున్నారని వివాదాలు తలెత్తుతున్నాయి. అందమైన పాటను తీసుకొచ్చి, దానికి మళ్లీ ఆ హంగులూ ఈ హంగులూ అద్ది కొత్తగా వినిపించడం ఏమిటి! అసలు దానివల్ల ఉపయోగం ఏముంది! ఇదే కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్‌ అంటున్న మాట. ఇన్‌‌స్ట్రుమెంట్స్, ఆర్కె స్ట్రయిజేష్‌‌, స్టైల్ అన్నీ మారి ఉండొచ్చు. అంతగా వాటిని వాడాలనుకుంటే కొత్త ట్యూన్స్ చేసుకోవాలి గానీ క్లాసిక్స్‌ ని టచ్ చేయడం ఎందుకు అనేది వారి వాదన.

బాలీవుడ్‌‌ సంగీత దర్శక ద్వయం విశాల్–శేఖర్ అయితే కాసింత సీరియస్‌‌ అయ్యారు కూడా. మా పాటల్ని ఎవరైనా రీమిక్స్ చేసినట్లు తెలిస్తే దావా వేస్తామని హెచ్చరించారిద్దరూ. ‘ఎంతో కష్టపడి ఒక పాటను సృష్టిస్తాం. దాన్ని పట్టుకెళ్లి మీ ఇష్టమొచ్చినట్టు మార్చేయడం కరెక్ట్ కాదు’ అంటున్నారు విశాల్. కొందరైతే ఒరిజినల్‌‌ కంపోజర్స్‌ దగ్గర అనుమతి తీసుకోవట్లేదట, కనీసం వారికి క్రెడిట్ కూడా ఇవ్వడం లేదట. అది మరీ అన్యాయం అని ఫైర్ అవుతున్నారు చాలామంది సంగీత దర్శకులు. గ్రేట్ సింగర్ లతా మంగేష్కర్‌‌‌‌ కూడా రీమిక్స్‌ వ్యవహారాన్ని తప్పుబట్టారు. సంగీతాన్ని గౌరవించాలని, ఎంతో కష్టపడి కొందరు తయారు చేసిన పాటని మరెవరో వచ్చి తమకి నచ్చినట్టు మార్చేయడం కరెక్ట్ కాదని తెగేసి చెప్పారు లత. అయినా ఇది ఆగింది లేదు. మన దగ్గర దేవిశ్రీ ప్రసాద్ లాంటి కొందరు అసలు రీమిక్స్​ చేయడానికే ఇష్టపడట్లేదు . బాలీవుడ్ లోనేమో బ్రేక్ పడట్లేదు. తెలుగులో అంటే సీనియర్ హీరోల పాటల్ని వాళ్ల వారసులు వాడుకుంటు న్నారు కనుక కాస్త ఫర్వాలేదు. కానీ హిందీలో ఎవరి పాటను ఎవరైనా వాడేస్తున్నారు.

ఇదంతా సరే.. అసలు రీమిక్స్ పాటల గురించి ప్రేక్షకులు, సంగీత ప్రియులు ఏమనుకుంటున్నారు? వాళ్లు కూడా పూర్తి ఇష్టంగా అయితే లేరు. ‘పాట బాగుంటే ఎన్నియేళ్లయినా వింటూనే ఉంటాం. దాన్ని మళ్లీ కొత్తగా చేసి వినిపించాల్సిన పని లేదు’అని వ్యక్తి అంటే… ‘కొత్తగా ప్రెజెంట్ చేద్దా మనుకోవడంలో తప్పు లేదు. పాత పాట బ్యూటీ చెడకుండా చూసుకోవాలి. అలా జరగకపోవడమే నచ్చట్లేదు ’అని ఓ కాలేజ్‌ స్టూడెంట్ అంటోంది. వాళ్ల మాటల్లో నిజం లేకపోతే బహుశా ఇన్ని రీమిక్స్ పాటలు ఫెయిలయ్యేవి కూడా కాదేమో. ఒక్క ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ తప్ప… తెలుగులో ఇప్పటి వరకు ఏ రీమిక్స్ సాంగ్‌ పాత పాటను మించి హిట్టవ్వలేదని విశ్లేషకుల భావన. అలాగని మిగతావన్నీ ఫెయిలయ్యాయని కాదు. ఆకట్టు కోవాల్సినంతగా ఆకట్టు కోలేదని. పాత పాట కంటే బాగుందనిపించుకోలేక పోయాయని. క్లాసిక్స్‌‌లోని శ్రావ్యత వీటిలో లోపించడం, ఇన్‌‌స్ట్రుమెంట్స్ డామినేట్ చేయడం, పాత గొంతుల్లోని మాధుర్యం కొత్త సింగర్స్‌‌ గొంతుల్లో కొరవడటం వంటి చాలా కారణాలే ఉన్నాయి ఈ పాటలు ఫెయిలవ్వడానికి. వరుసగా ఇదే రిపీట్ అవుతూ ఉండటంతో తమకిష్టమైన పాటను రీమిక్స్ చేస్తున్నారని తెలిసినా ప్రేక్షకులు మరీ ఎక్కువ ఉత్సాహపడటం లేదు. హిట్టని ముందే డోన్ట్ ఫిక్స్.. బికాజ్​ దిసీజ్ రీమిక్స్‌‌ అంటున్నారు.