ఆబ్కారీ శాఖ కొత్త ఎస్‌ఐలకు.. పోస్టింగుల్లేవ్​.. జీతాల్లేవ్‌!

ఆబ్కారీ శాఖ కొత్త ఎస్‌ఐలకు.. పోస్టింగుల్లేవ్​.. జీతాల్లేవ్‌!

హైదరాబాద్‌, వెలుగు: ఆబ్కారీ శాఖలోని కొత్త ఎస్‌ఐలకు ఇటు పోస్టింగ్స్​ లేవు.. అటు జీతాలు లేవు. కష్టపడి కొలువు సాధించుకున్నా అందుకు ప్రతిఫలం దక్కుతలేదు. నియామక పత్రాలు అందుకొని రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ పోస్టింగ్స్‌ ఇవ్వకుండా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొందరికైతే తొమ్మిది నెలలుగా జీతాలు కూడా ఇస్తలేదు. 

నియామకాలకే నాలుగేండ్లు పట్టింది

గ్రూప్‌–2 ఉద్యోగాల కోసం 2015లో టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆ తర్వాత ఏడాదికి పరీక్షలు నిర్వహించారు. కోర్టు కేసులు, వివాదాల తర్వాత 2019లో ఆబ్కారీ శాఖలో 280 మందికి నియామక పత్రాలు అందించారు. ఎట్టకేలకు ఉద్యోగాలు వచ్చాయని వారు సంతోషించారు. కానీ ఇప్పటికీ రెగ్యులర్​ పోస్టులు ఇవ్వడం లేదు. 193 మంది ఎస్‌ఐలను వివిధ స్టేషన్లలో అటాచ్‌మెంట్‌తోనే నెట్టుకొస్తున్నారు. కానీ వీరికి ఎలాంటి డ్యూటీలు, అధికారాలు లేవు. మరో 87 మందికి అటాచ్‌మెంట్‌ కూడా లేకుండా ఎక్సైజ్‌ అకాడమికే పరిమితం చేశారు. నియామక పత్రాలు అందుకొని దాదాపు రెండేండ్లు కావస్తున్నా రెగ్యులర్ పోస్టింగ్స్‌ ఇవ్వకపోవడంతో దూర ప్రాంతాల్లో పని చేస్తున్నవారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు.

జీతాల్లేక.. పూటగడవక..

ఓ వైపు పోస్టింగ్స్‌ ఇవ్వకపోవగా.. ఎక్సైజ్‌ అకాడమికి పంపించిన 87 మందికి తొమ్మిది నెలలుగా జీతాలు రావడంలేదు. సూపర్‌ న్యూమరీ పోస్టుల కోసం ఇచ్చిన జీవో గడువు ముగిసినప్పటి నుంచి జీతాలు చెల్లించడంలేదు. ఫలితంగా సబ్‌ ఇన్‌స్పెక్టర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇంటి రెంట్లు, నిత్యావసరాలు, పిల్లల స్కూల్​ ఫీజులు తదితర అవసరాలకు తిప్పలు పడుతున్నారు. కొంత మంది ఎస్​ఐలుగా కొనసాగుతూనే.. బయట ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కరోనా టైంతో చాలా మంది ఎస్‌ఐలు, వారి కుటుంబ సభ్యులు కరోనా సోకి ఆస్పత్రిపాలయ్యారు. ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ కుటుంబంలో తల్లి, తండ్రి, సోదరుడు వరుసగా మూడు రోజుల వ్యవధిలో చనిపోయిన ఘటన కూడా ఉంది. హెల్త్​ కార్డులున్నా  ప్రైవేట్ హాస్పిటళ్లు చేర్చుకోవడం లేదు. 

అడ్‌హక్‌ ప్రమోషన్లతో వీళ్లకు తిప్పలు

ఆబ్కారీ శాఖలో అవసరాల కోసం జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లకు గతంలో ఎస్‌ఐలుగా తాత్కాలిక (అడ్‌హక్‌) ప్రమోషన్లు ఇచ్చారు. కొత్త ఎస్‌ఐలు చేరేనాటికి వీరంతా స్టేషన్లలో డ్యూటీలు చేస్తుండటంతో సరిపడా ఖాళీలులేవు. దీంతో కొత్తవారిలో 193 మందిని వివిధ ఎక్సైజ్‌ స్టేషన్లలో అటాచ్‌మెంట్‌ చేశారు. మరో 87 మందికి సూపర్‌ న్యూమరీ పోస్టులను క్రియేట్‌ చేశారు. ఈ పోస్టులకు ఈ ఏడాది జనవరిలో గడువు ముగియడంతో 87 మందిని ఎక్సైజ్‌ అకాడమీకి పంపించారు. వాస్తవానికి అడ్‌హక్‌ ప్రమోషన్లు తాత్కాలికమైనవి. ఎస్‌ఐ పోస్టులకు నేరుగా రిక్రూట్‌మెంట్‌ జరిగితే వీరంతా రివర్షన్‌కు వెళ్లాలి. కానీ అందుకు విరుద్ధంగా అడ్‌హక్‌ ప్రమోషన్లు పొందినవారిని కాపాడేందుకు పలువురు ఉన్నతాధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకుని తమకు న్యాయం చేయాలని  ఆబ్కారీ ఎస్‌ఐలు కోరుతున్నారు.